న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి పర్యావరణ అనుమతులను సవాల్ చేస్తూ జాతీయ హరిత ట్రిబ్యూనల్(ఎన్జీటీ)లో దాఖలైన పిటిషన్‌పై విచారణ ఈ నెల 19కి వాయిదా పడింది. పోలవరం ప్రాజెక్టు రాష్ట్ర ప్రాజెక్టుగా ఉన్నప్పుడు 2005లో ఇచ్చిన పర్యావరణ అనుమతులు ఇప్పుడు చెల్లవని రేలా అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం సోమవారం విచారించింది. గతంలో ఇచ్చిన అనుమతులు కేవలం ఐదేళ్లకు మాత్రమే పరిమితం అని పిటిషనర్ల తరఫు న్యాయవాది అనుప్ జే బంబానీ వాదించారు.
ప్రాజెక్టు డిజైన్‌ను ప్రారంభ దశ నుంచి ఇప్పటి వరకు అనేక సార్లు మార్చారని.. అందువల్ల గతంలో ఇచ్చిన అనుమతులు చెల్లుబాటు కావని పేర్కొన్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన స్టాప్ వర్క్ ఆర్డర్’ను కూడా ప్రభుత్వం అబయన్స్‌లో పెట్టి.. శరవేగంగా ప్రాజెక్టు పనులు చేపడుతోందని వివరించారు. ప్రాజెక్టు ముంపు బాధితుల గోడును ఎవరూ పట్టించుకోవడం లేదని, స్థానిక అధికారులు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు బాధితుల నుంచి ఫిర్యాదులను కూడా స్వీకరించడం లేదన్నారు. అందువల్ల బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించడానికి ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.
అయితే ఈ ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ కానీ ఇప్పటి వరకు స్పందించకపోవడంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. నోటీసులు జారీ చేసి చాలా కాలం అయినా ఇప్పటి వరకు సమాధానం ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నించింది. రెండు వారాల్లోపు స్పందించకుంటే తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. గడువు పొడిగించాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది అభ్యర్థించినా ధర్మాసనం అందుకు అంగీకరించలేదు. తదుపరి విచారణను అక్టోబర్ 19కి వాయిదా వేసింది. ఆ రోజు ప్రాజెక్టు నిర్మాణంపై మధ్యంతర స్టే విధింపుపై విచారణ చేపడతామని పేర్కొంది.
ఎన్జీటీలో పోలవరం ప్రాజెక్ట్ కేసు 19కి వాయిదా
Published Mon, Oct 3 2016 7:11 PM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM
Advertisement
Advertisement