జాతీయ పార్టీలకు రూ.622.38 కోట్ల విరాళాలు
న్యూఢిల్లీ: జాతీయ పార్టీలకు వివిధ సంస్థలు, వ్యక్తుల నుంచి 2014-15 ఆర్థిక సంవత్సరంలో భారీ మొత్తంలో విరాళాలు అందాయి. జాతీయ స్థాయి రాజకీయ పార్టీలకు రూ.20 వేలకు పైగా వచ్చిన విరాళాల వివరాలను అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్‌స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ (ఎన్‌ఈడబ్ల్యూ) విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, ఎన్సీపీ, సీపీఐ, సీపీఎంలకు వచ్చిన విరాళాల వివరాలు ఇందులో పేర్కొంది.
అన్నిజాతీయ పార్టీలకు కలిపి మొత్తం 1,695 విరాళాలు అందగా, వాటి విలువ రూ. 622.38 కోట్లు. ఈ రేసులో సహజంగానే అధికార బీజేపీ ముందంజలో ఉంది. ఆ పార్టీకి రూ. 437.35 కోట్ల విరాళాలు వచ్చాయి. గత పదేళ్లుగా బీఎస్పీకి వస్తున్న విరాళాలను వెల్లడిస్తున్నా, ఈ ఆర్థిక సంవత్సరానికి తమకు రూ. 20 వేల పైన విరాళాలు ఏవీ అందలేదని ఆ పార్టీ తెలిపింది.
జాతీయ పార్టీలకు 2014-15 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన విరాళాలు
పార్టీలు విరాళాల సంఖ్య రూ. కోట్లలో
బీజేపీ 1234 437.35
కాంగ్రెస్ 280 141.46
ఎన్సీపీ 52 38.82
సీపీఎం 74 3.42
సీపీఐ 55 1.33
2013-14 ఆర్థిక సంవత్సరంతో 2014-15 ఆర్థిక సంవత్సరం పోల్చితే అన్ని జాతీయ పార్టీలకు అందిన విరాళాలు గణనీయంగా పెరిగాయి.
పార్టీలు 2013-14 2014-15
బీజేపీ 170.86 437.35
ఐఎన్సీ 59.58 141.46
ఎన్సీపీ 14.02 38.82
సీపీఎం 2.09 3.42
సీపీఐ 1.22 1.33
రెండు పార్టీలకూ ఆ కంపెనీల విరాళాలు
కంపెనీలు రాజకీయ పార్టీలకు విరాళాలు నేరుగా ఇవ్వకుండా ఎలక్టోరల్ ట్రస్టులను ఏర్పాటు చేసుకుని వాటి ద్వారా ఇస్తాయి. బీజేపీకి సత్యా ఎలక్టొరల్ ట్రస్టు ద్వారా భారతీ గ్రూప్ రూ 107.25 కోట్లు, జనరల్ ఎలక్టోరల్ ట్రస్టు ద్వారా ఆదిత్య బిర్లా గ్రూపు రూ 63.02 కోట్లను విరాళాలుగా ఇచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి జనరల్ ఎలక్టోరల్ ట్రస్టు ద్వారా ఆదిత్య బిర్లా గ్రూపు రూ 54.01 కోట్లను, సత్యా ఎలక్టోరల్ ట్రస్టు ద్వారా భారతీ గ్రూప్ రూ 18.75 కోట్లను విరాళాలుగా ఇచ్చాయి.