దేశ రాజధాని ఢిల్లీలో మత కార్యక్రమం తబ్లిగి జమాత్ మర్కజ్ జరిగిన నిజాముద్దీన్ మసీద్ ప్రాంతాన్ని బుధవారం రసాయనాలతో శుద్ధి చేస్తున్న ప్రభుత్వ సిబ్బంది
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ హాట్‌స్పాట్‌గా మారిన ఢిల్లీలోని నిజాముద్దీన్ తబ్లిగి జమాత్‌కు హాజరై, స్వస్థలాలకు తిరిగివెళ్లిన వారి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జల్లెడ పడుతున్నాయి. వారిలో ఇప్పటివరకు వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో దాదాపు 6 వేల మందిని అధికారులు గుర్తించారు. వారిలో 5 వేల మందిని క్వారంటైన్ చేశారు. వివిధ రాష్ట్రాల్లోని మిగతా సుమారు 2 వేల మంది కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఆ 2 వేల మందిలో గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలవారే అధికంగా ఉన్నారు.
ఈ నేపథ్యంలో, తబ్లిగి జమాత్ సదస్సుకు హాజరై స్వస్థలాలకు వెళ్లిన వారు.. ఆ తరువాత ఎవరెవరిని కలిశారో యుద్ధ ప్రాతిపదికన ఆరా తీయాలని కేంద్రం రాష్ట్రాలను మరోసారి ఆదేశించింది. తబ్లిగి జమాత్‌లో పాల్గొన్న వారిలో చాలామంది వైరస్ బారిన పడుతున్న నేపథ్యంలో కేంద్రం రాష్ట్రాలను మరోసారి అప్రమత్తం చేసింది. కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా బుధవారం అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. తబ్లిగి జమాత్ మర్కజ్‌కు హాజరైన వారు ఆ తరువాత ఎవరెవరని కలిశారన్న విషయం గుర్తించేందుకు యుద్ధ ప్రాతిపదికన పనిచేయాలని ఆయన కోరారు.
తబ్లిగి జమాత్‌లో పాల్గొన్న విదేశీయులు వీసా నిబంధనలను ఉల్లంఘించినట్టు తేలిందని, వీసా నిబంధనలను ఉల్లంఘించిన విదేశీయులపైన, నిర్వాహకులపైన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను కోరారు. వారం రోజుల్లోగా రాష్ట్రాలు ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజనను అమలు చేయాలని కోరారు. ఈ పథకం కింద రూ. 27,500 కోట్లను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు జమ చేయనున్నారు. సరుకులను ఎలాంటి అడ్డంకులు లేకుండా రాష్ట్రాల మధ్య రవాణా జరిగేలా చర్యలు తీసుకోవాలని, ఈ సందర్భంగా అంతా భౌతికదూరం పాటించేలా చూడాలని రాష్ట్రాలను కోరారు.
కరోనాపై పోరుకు భారీ నష్టం
కరోనా కట్టడికి ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలకు ఢిల్లీలో జరిగిన తబ్లిగి జమాత్ సమావేశం భారీ నష్టం చేకూర్చిందని జాతీయ మైనారిటీ కమిషన్ ఆవేదన వ్యక్తం చేసింది. మదర్సాలు, ఇతర మత ప్రదేశాలు లాక్‌డౌన్‌ను కచ్చితంగా అమలు చేసేలా చూడాలని రాష్ట్రాలను కోరింది. నిజాముద్దీన్ ఘటన లాక్‌డౌన్‌ను ఉల్లంఘించడమే కాకుండా, సహ పౌరుల ప్రాణాలను పణంగా పెట్టడమేనని ఎన్‌సీఎం చీఫ్ సయ్యద్ ఘయోరుల్ హసన్ రిజ్వీ పేర్కొన్నారు. ఉల్లంఘనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. లాక్‌డౌన్‌ను కచ్చితంగా అమలు చేసేందుకు మత పెద్దల సహకారం తీసుకోవాలన్నారు. జమాత్‌కు హాజరైనవారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపించుకోవాలని కోరారు.
► కరోనా హాట్‌స్పాట్స్, క్వారంటైన్ కేంద్రాలు, బహిరంగ ప్రదేశాలను వైరస్ రహితంగా చేసేందుకు ఫైర్ సర్వీస్ సిబ్బంది సేవలను ఉపయోగించుకోవాలని ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ అధికారులను ఆదేశించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇతర ఉన్నతాధికారులతో బుధవారం ఆయన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
► తబ్లిగి జమాత్ మర్కజ్ నుంచి గత 36 గంటల్లో 2,361 మందిని తరలించామని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తెలిపారు. వారిలో 617 మందిని ఆసుపత్రులకు, మిగతావారిని క్వారంటైన్ కేంద్రాలకు పంపించామన్నారు.
► రాజస్తాన్‌లోని అజ్మీర్ జిల్లాలో ఉన్న సర్వార్ పట్టణంలోని ఒక దర్గాలో మంగళవారం జరిగిన మతపరమైన కార్యక్రమానికి 100 మందికి పైగా ప్రజలు హాజరయ్యారు. వారిని పంపించేందుకు పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి చేయాల్సి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment