సిద్ధూ సంచలన నిర్ణయం
చండీగఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆవాజ్-ఏ-పంజాబ్ వ్యవస్థాపకుడు, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాబ్ ఎన్నికల్లో పోటీ చేయబోమని ప్రకటించారు. తమది రాజకీయ పార్టీ కాదని, ఓపెన్ ఫ్రంట్ మాత్రమే అని తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పంజాబ్ ను మెరుగు పరిచేందుకు తమ ఫ్రంట్ లో చేరాలని పార్టీలను ఆయన ఆహ్వానించారు. ఆవాజ్-ఏ-పంజాబ్ తో ఆమ్ ఆద్మీ పార్టీ సంప్రదింపులు జరుపుతోందని ఊహగానాలు వస్తున్న నేపథ్యంలో సిద్ధూ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.
ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోకూడన్న ఉద్దేశంతో ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించినట్టు సిద్ధూ వెల్లడించారు. తాము పోటీకి దిగితే అధికార అకాలీదళ్ ప్రభుత్వం లాభపడే అవకాశముందని అభిప్రాయపడ్డారు. కొత్త పార్టీ ప్రజల్లోకి వెళ్లాలంటే కనీసం రెండేళ్లు పడుతుందని, మూడు నెలలు చాలా తక్కువ సమయమని పేర్కొన్నారు. పంజాబ్ ఎన్నికల్లో తనను పోటీ చేయొద్దని ఢిల్లీ సీఎం కోరారని చెప్పారు. ఆప్ అధికారంలోకి వస్తే తన భార్య నవజ్యోత్ కౌర్ కు మంత్రి పదవి ఇస్తామని ఆశ పెట్టారని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని వచ్చిన ఆహ్వానాన్ని కూడా తిరస్కరించినట్టు చెప్పారు.