పంజాబ్ అభ్యున్నతి కోసం పార్టీ
♦ ఆవాజ్-ఏ-పంజాబ్ పార్టీని లాంఛనంగా
♦ ప్రకటించిన మాజీ క్రికెటర్ సిద్ధూ
♦ కేజ్రీవాల్ అర్ధ సత్యాలు చెపుతున్నారు
♦ కొద్ది రోజుల్లో భవిష్యత్ ప్రణాళిక వెల్లడిస్తామని వెల్లడి
చండీగఢ్: పంజాబ్ అభ్యున్నతి కోసమే ఆవాజ్-ఏ-పంజాబ్ రాజకీయేతర పార్టీని స్థాపించినట్టు ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన మాజీ క్రికెటర్ నవజ్యోత్‌సింగ్ సిద్ధూ ప్రకటించారు. గురువారం చండీగఢ్‌లో కొత్త పార్టీని సిద్ధూ లాంఛనంగా ప్రకటించారు. ప్రజాస్వామ్య అధికారాన్ని ప్రజల చేతికి అందించడం కోసమే కొత్త పార్టీ స్థాపించినట్టు సిద్ధూ చెప్పారు. రానున్న 15-20 రోజుల్లో తన పార్టీ భవిష్యత్ ప్రణాళికను ప్రకటిస్తామన్నారు. కొత్త పార్టీ ఏర్పాటు సందర్భంగా అకాలీదళ్-బీజేపీ కూటమి, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలపై తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురిపించారు సిద్ధూ. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రజాస్వామ్యం పేరుతో అరాచకాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కేజ్రీవాల్ అర్ధ సత్యాలు చెపుతున్నారని ఆరోపించారు. తాను ఒక్కడే నిజాయతీపరుడని, మిగతా వారంతా అవినీతిపరులని కేజ్రీవాల్ భావిస్తారని, అది తన కాపీరైట్‌గా అనుకుంటారని చెప్పారు.
పంజాబ్‌పై కారు మేఘాలు..
అధికారంలో ఉన్న బాదల్ కుటుంబం.. పంజాబ్, ప్రజలపై కారు మేఘాలు(కాలా బాదల్) కమ్మేలా చేసిందన్నారు. ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకునేది తమ కోసమని, బాదల్ కుటుంబం కోసం కాదని గుర్తు చేశారు. కాంగ్రెస్, అకాలీదళ్ ఒకే నాణేనికి ఉన్న రెండు ముఖాలని, ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడుతూ పంజాబ్‌ను నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకప్పుడు దేశానికి ధాన్యాగారంగా ఉన్న పంజాబ్, ఇప్పుడు బిక్షపాత్రగా మారిందంటే దానికి పంజాబ్‌లోని రాజకీయ వ్యవస్థే కారణమన్నారు.