ఖాన్‌తో గేమ్స్ వద్దు!
* గురి తప్పని హైదరాబాదీ హంటర్
* ఒక్క షాట్‌తో గజరాజును నేలకూల్చిన షఫత్ అలీఖాన్
సాక్షి, హైదరాబాద్: జనావాసాలపై పడి బీభత్సం సృష్టించే అడవి జంతువులను వేటాడే హైదరాబాదీ హంటర్ నవాబ్ షఫత్ అలీఖాన్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. జార్ఖండ్ నుంచి బిహార్‌లోకి ప్రవేశించి, గయ ఫారెస్ట్ డివిజన్‌లో భయోత్పాతం సృష్టించిన ఏనుగును ఖాన్ ఒకే ఒక్క తూటాతో నేలకూల్చారు. శనివారం తెల్లవారుజాము నుంచి ఏనుగు చర్యలు హింసాత్మకంగా మారడంతో... అక్కడి సర్కారు ‘షూట్ ఎట్ సైట్’ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో తన .458 వించిస్టర్ మాగ్నమ్ రైఫిల్‌కు పని చెప్పిన హైదరాబాదీ... శనివారం మధ్యాహ్నానికి దాన్ని హతమార్చారు. ఈ ‘ఆపరేషన్’ వివరాలను ఆయన ఫోన్‌లో ‘సాక్షి’కి తెలిపారు.
నేపాల్‌లో తగిలిన తూటాతో...
ఈ మగ ఏనుగు వయసు 35 ఏళ్లుగా ఖాన్ నిర్థారించారు. భారత్-నేపాల్ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతానికి చెందినదిగా భావిస్తున్నారు. అక్కడి వేటగాళ్ల బారినపడిన దీనికి కళ్ల మధ్య తూటా దిగింది. ఈ గాయం వల్ల ఇన్ఫెక్షన్ అయి తీవ్రంగా ఇబ్బంది పడిన ఏనుగు ఆహారాన్ని వెతుక్కొంటూ మైదానాలు, అడవులు, గ్రామాల్లో తిరుగుతోంది. చివరకు ఛునాపూర్ ప్రాంతానికి చేరుకుని... పంటలు, ఇళ్లపై విరుచుకుపడింది. అనేక మందిని గాయపరిచి, ఓ బాలుడిని తొక్కి చంపింది. దీన్ని ట్రాంక్వలైజ్ చేయడానికి వెళ్లిన ఖాన్ తన ఆపరేషన్‌ను శుక్రవారం ఉదయం ప్రారంభించారు. ఏనుగు ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లోకి చొరబడటంతో ఫలితం దక్కలేదు. అక్కడి నుంచి కథియవర్ జిల్లాలోని యెహానీగావ్‌లోకి ప్రవేశించింది.
రెండిళ్లు ధ్వంసం చేయడంతో పాటు 27 మందిని గాయపరిచింది. కరే పండిట్ అనే 35 ఏళ్ల రైతుతో పాటు ముగ్గురిని తొక్కి చంపింది. పరిస్థితులు చేయి దాటిపోతున్నాయని గుర్తించిన బిహార్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ టీకే గుప్తా, గయ డీఎఫ్‌ఓ ఎస్‌ఎస్ సింగ్‌లు ఏనుగుపై ‘షూట్ ఎట్ సైట్’ ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం ఉదయం 8 గంటల నుంచి ఏనుగు కోసం ఖాన్ యెహానీగావ్‌లో గాలింపు చేపట్టారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో దట్టమైన మొక్కజొన్న తోటలో గజరాజు దాక్కున్నట్లు గుర్తించారు. ఏనుగు ఆయనపై దాడికి యత్నించింది. అప్రమత్తమైన ఖాన్ తన వద్దనున్న అరుదైన వించిస్టర్ మాగ్నమ్ రైఫిల్‌తో 12 మీటర్ల దూరంలో ఉన్న ఏనుగును కాల్చారు. తూటా నేరుగా తలలోకి దూసుకుపోవడంతో ఒక్క షాట్‌లో నేలకొరిగింది. బిహార్ ప్రభుత్వం, ప్రజలు ఖాన్‌ను అభినందించారు.
‘వేట’ల సంఖ్య 23
ఈ ఏనుగుతో కలిపి ఇప్పటి వరకు షఫత్ అలీఖాన్ చేసిన ‘వేట’ల సంఖ్య 23కు చేరింది. 1976 నుంచి ‘వేటాడుతున్న’ ఈయన గతంలో ప్రజల ప్రాణాలు తీస్తున్న ఏడు ఏనుగులు, మూడు పులులు, 12 చిరుతల్ని హతమార్చారు. బిహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాల కోరిక మేరకు ఆయా రాష్ట్రాల్లో రైతులు, ప్రజలను ఇబ్బంది పెడుతున్న వెయ్యి అడవి దున్నలు, 15,200 అడవి పందులు, 1300 అడవి కుక్కల్ని చంపారు.