'నీట్'పై సుప్రీంకోర్టు తుది తీర్పు
న్యూఢిల్లీ: వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి దేశవ్యాప్త ఉమ్మడి ప్రవేశ పరీక్ష 'నీట్' తప్పనిసరి అని సుప్రీంకోర్టు తేల్చేసింది. రాష్ట్రాలు వేర్వేరుగా ప్రవేశ పరీక్షలు నిర్వహించడం కుదరదని స్పష్టం చేసింది. అవసరమైతే నీట్-2 తేదీ మార్చుకోవచ్చని సూచించింది. 'నీట్'పై ముగ్గురు సభ్యులతో కూడిన ధర్మాసనం వెలువరించిన తీర్పు కాపీని సోమవారం రాత్రి వెబ్ సైట్ లో పెట్టారు.
నీట్-1 రాసిన వారు కూడా నీట్- 2 రాయొచ్చని పేర్కొంది. నీట్-2 రాయాలనుకుంటున్న విద్యార్థులు తమ అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవాలని సూచించింది. గత ఉత్తర్వులను సవరించేందుకు సర్వోన్నత న్యాయస్థానం ససేమీరా అంది. 'నీట్' వల్ల రాష్ట్రాల హక్కులు, స్థానిక రిజర్వేషన్లకు ఎలాంటి భంగం వాటిల్లదని పేర్కొంది. మైనారిటీ కాలేజీల హక్కులకు ఎటువంటి నష్టం జరగదని తెలిపింది. 'నీట్' పర్యవేక్షణకు మాజీ చీఫ్ జస్టిస్ లోధా నేతృత్వంలో కమిటీ నియమించనున్నట్టు వెల్లడించింది.
ఉమ్మడి ప్రవేశ పరీక్షను నిర్వహించాలని ఎన్జీఓలు వేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు.. నేషనల్ ఎలిజిబిలిడీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)ను దేశవ్యాప్తంగా రెండు విడతలుగా నిర్వహించాలని ఇటీవల ఆదేశించడం తెలిసిందే. అందులో భాగంగా ఈ నెల 1న నీట్ తొలి విడత పరీక్ష జరగగా.. జూలై 24న రెండో విడత 'నీట్' జరగాల్సి ఉంది.