‘నీట్’ ఆర్డినెన్స్‌పై న్యాయ సలహా కోరిన రాష్ట్రపతి
న్యూఢిల్లీ: వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష(నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్-నీట్) నుంచి రాష్ట్రాల బోర్డులకు ఏడాది పాటు మినహాయింపు కల్పించేందుకు ఉద్దేశించిన ఆర్డినెన్స్‌పై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ న్యాయ సలహా కోరారు. పలు రాష్ట్రాలు, విపక్షాల డిమాండ్ మేరకు నీట్ తప్పనిసరంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పాక్షికంగా పక్కనబెడ్తూ, రాష్ట్రాల బోర్డులకు ఏడాది పాటు మినహాయింపునిస్తూ రూపొందించిన ఆర్డినెన్స్‌ను శుక్రవారం కేంద్ర కేబినెట్ ఆమోదించిన విషయం తెలిసిందే.
ఆ ఆర్డినెన్స్‌లోని పలు అంశాలపై రాష్ట్రపతి ప్రణబ్ శనివారం న్యాయ నిపుణుల నుంచి వివరణ కోరినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అలాగే, ఇంత అత్యవసరంగా ఆర్డినెన్స్‌ను తీసుకురావాల్సిన అవసరమేంటని కూడా ప్రణబ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్లు తెలుస్తోంది.