!['బావ, నేతాజీది ఒకే తీరు.. శైలి' - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/5/81487130952_625x300.jpg.webp?itok=KIt0lZUU)
'బావ, నేతాజీది ఒకే తీరు.. శైలి'
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణ యాదవ్ తొలిసారి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్నా.. ప్రచారంలో మాత్రం తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. మూడో దఫా ఎన్నికల్లో భాగంగా ఆదివారం పోలింగ్ జరగనున్న తన నియోజకవర్గం లక్నో కంటోన్మెంట్ లో యూపీ కాంగ్రెస్ చీఫ్ రాజ్ బబ్బర్ తో కలిసి మంగళవారం ఓ బహిరంగసభలో అపర్ణ పాల్గొన్నారు. నేతాజీ ములాయం, వరుసకు బావ అయిన యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ ఒకేతీరుగా వ్యవహరిస్తారని.. ఆ ఇద్దరిరి ఒకే స్వభావమని.. అభివృద్ధే వారి లక్ష్యమని కొనియాడారు. తమ పార్టీ ఇక్కడ రూ.40 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించిందని, మరోసారి ఎస్పీని గెలిపిస్తే అద్భుతాలు చేసి చూపిస్తామని అపర్ణ తెలిపారు.
నియోజకవర్గంలో ఆమె ఎక్కడ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో ఆ సభలలో 'ఫ్యూచర్ మినిస్టర్' అంటూ కార్యకర్తలు నినాదాలు చేయడం ఆమెలో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది. 'నేను తొలుత ఇక్కడి ఆడపడుచును.. ఆ తర్వాతే కోడలుగా వచ్చాను' అంటూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. వరుసకు సోదరి అయిన ఎస్పీ ఎంపీ డింపుల్ యాదవ్ తాను చాలా సన్నిహితంగా ఉంటామని, ఇద్దరి వ్యక్తిత్వాలు వేరని చెప్పుకొచ్చారు. ఇప్పటికీ మేమిద్దరం మా వ్యక్తిగత విషయాలను సంతోషంగా షేర్ చేసుకునేంతగా తమ మధ్య చనువు ఉందని ఓ విలేకరి ప్రశ్నకు ఇలా జవాబిచ్చారు.
ఎస్పీలో తలెత్తిన అంతర్గత కుటుంబపోరుతో అపర్ణ యాదవ్ ప్రముఖంగా వెలుగులోకి వచ్చారు. శివ్‌పాల్ యాదవ్ వర్గం వ్యక్తిగా పేరొందిన అపర్ణ ఎస్పీని తన చేతుల్లోకి తీసుకోవాలని భావించినట్లు కథనాలు వచ్చాయి. ఓ దశలో సీఎం అఖిలేశ్ ఆమెకు సీటు ఇస్తారా లేదా అనే సందేహం వచ్చినా.. చివరికి అపర్ణ, బాబాయి శివపాల్ యాదవ్ లకు పార్టీ టికెట్ ఇచ్చి బరిలో నిలిపారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన రీటా బహుగుణ జోషీపై కాంగ్రెస్ శ్రేణులు అసంతృప్తిగా ఉండటం అపర్ణకు కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది. అపర్ణకు బలమైన అభ్యర్థి రీటా బహుగుణ జోషీ (బీజేపీ)ని లక్నో కంటోన్మెంట్ స్థానంలో ఎదుర్కొంటుండటంతో అందరి చూపు ఈ స్థానంపై ఉంది.