
యూపీ నియామకాల్లో సం‘కుల’ సమరం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ముఖ్యమంత్రి గురు ఆదిత్యనాథ్ యోగి ప్రభుత్వం ఇటీవల జరిపిన న్యాయ అధికారుల నియామకాలు వివాదాస్పదమవుతున్నాయి. మొత్తం 312 మంది అధికారులకుగాను 90 శాతం అధికారులను అగ్ర కులాల నుంచి ఎంపిక చేయడం, వారిలో దాదాపు సగం మందిని, అంటే 152 మందిని బ్రాహ్మణ కులం నుంచి ఎంపిక చేయడం పట్ల బలహీన వర్గాలవారు, ఇతర వెనుకబడిన వర్గాల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 312 మంది న్యాయ అధికారల నియామకాల్లో 282 మంది అగ్రకులాలకు చెందిన బ్రాహ్మణలు, ఠాకూర్లు, భూమిహార్లు, కయస్థాలు, వైశ్యులు ఉన్నారు.
ఆదిత్యనాథ్ యోగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి తన కులస్థులైన ఠాకూర్లనే ఎక్కువగా ప్రభుత్వ పదవుల్లోకి తీసుకుంటున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఈసారి బ్రాహ్మణులకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. రాయబరేలిలో వెనకబడిన వర్గాలకు, బ్రాహ్మణులకు జరిగిన ఘర్షణల్లో ఐదుగురు మరణించిన సంఘటనను కూడా పరిగణలోకి తీసుకోవడం వల్ల బ్రాహ్మణులకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. భూముల విషయమై బీసీలకు, బ్రాహ్మణులకు గొడవ జరిగిన విషయం తెల్సిందే.
ప్రభుత్వ చీఫ్ స్టాండింగ్ కౌన్సిలర్లు, అదనపు చీఫ్ స్టాండింగ్ కౌన్సిల్స్, స్టాండింగ్ కౌన్సిల్స్, బ్రీఫ్ హోల్లర్స్ (సివిల్), బ్రీఫ్ హోల్డర్స్ (క్రిమినల్) అనే ఐదు విభాగాల్లోనూ బ్రాహ్మణులకే ఆధిత్యనాథ్ పెద్ద పీట వేశారు. నలుగురు చీఫ్ స్టాండింగ్ కౌన్సిల్స్ నియామకాల్లో ముగ్గురిని, 25 మంది అదనపు చీఫ్ స్టాండింగ్ కౌన్సిల్స్‌లో 13 మందిని, 103 స్టాండింగ్ కౌన్సిల్స్‌లో 58 మందిని, 66 మంది బ్రీఫ్ హోల్డర్లలలో (సివిల్స్) 36 మందిని 114 బ్రీఫ్ హోల్డర్లలో (క్రిమినల్) 42 మందిని బ్రాహ్మణ కులస్థులనే నియమించారు. ఇతర వెనకబడిన వర్గాల నుంచి కేవలం 16 మందిని తీసుకున్నారు. అంటే మొత్తం నియామకాల్లో 5 శాతం మించి వారికి ప్రాతినిధ్యం లభించలేదు.