ఓలా, ఉబర్ క్యాబ్ లకు మీటర్లు తప్పనిసరి!
న్యూఢిల్లీః ఓలా, ఉబర్ వంటి టాక్సీ అగ్రిగేటర్లపై ప్రభుత్వం కొరడా ఝళిపించనుంది. ఇష్టారాజ్యంగా రేట్లను పెంచి, అనైతికంగా వినియోగదారులను నిలువుదోపిడీ చేస్తున్న ప్రైవేట్ క్యాబ్ లపై దృష్టి సారించింది. ఇప్పటికే ఉబర్, ఓలా ట్యాక్సీల ధరల పెంపుపై ఢిల్లీ ప్రభుత్వం నిషేధం విధించింది. త్వరలో అటువంటి నిబంధనలను మోటార్ వాహనాల చట్టం పరిధిలోకి తేనుంది. ఆయా అగ్రిగేటర్లను 'ఇంటర్మీడియరీస్' పేరున రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఓ ప్రత్యేక వర్గంగా గుర్తించనుంది.
ఓలా, ఉబర్ ట్యాక్సీలు అమాంతం రేట్లను పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామని గతంలో కేజ్రీవాల్ ప్రభుత్వం హెచ్చరించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ దేశవ్యాప్తంగా ప్రైవేట్ క్యాబ్ ల దోపిడీ రోజురోజుకూ పెరిగిపోతుండటంతో ప్రభుత్వం స్పందించింది. వారిని కూడ మోటార్ వాహనాల చట్టం పరిధిలోకి తెచ్చి ధరలపై నిబంధనలు విధించేందుకు కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాలు సూచించిన ధరలను అనుసరించే విధంగా చట్టం రూపొందనుంది.
భారత ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించనున్న 'ఇంటర్ మీడియరీస్' వర్గం ఇంన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 పరిధిలోకి కూడ వస్తుంది. ఈ విషయంలో చివరి నిర్ణయం తీసుకునేందుకు ఎనిమిది రాష్ట్రాల రవాణా మంత్రులు జూన్ చివర్లో ధర్మశాలలో సమావేశం కానున్నారు. అనుకున్న ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ లభిస్తే ఓలా, ఉబర్ క్యాబ్ లు కూడ ఆటోల్లాగే ఆయా నగరాల నిబంధనలను బట్టి మీటర్లు, డ్రైవర్ల డ్రస్ కోడ్.. వంటివి పాటించాల్సి ఉంటుంది.