వచ్చే ఏడాది రూపొందించే బడ్జెట్ స్వరూపం ఎలా ఉంటుందనే దానిపై ప్రధాని మోదీ సంకేతాలిచ్చారు.
వివిధ శాఖల కార్యదర్శులతో భేటీలో ప్రధాని
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది రూపొందించే బడ్జెట్ స్వరూపం ఎలా ఉంటుందనే దానిపై ప్రధాని మోదీ సంకేతాలిచ్చారు. బడ్జెట్ పూర్తిగా నూతన ఆలోచనలు, ప్రతిపాదనలతో ఉండాలని మంత్రిత్వశాఖలు, విభాగాలకు చెందిన 80 మంది కార్యదర్శులకు తన నివాసంలో ఇచ్చిన తేనీటి విందులో మోదీ. ముఖ్యంగా పెట్టుబడులకు తగిన ఫలితాలు ఉండేలా బడ్జెట్ ఉండాలని పేర్కొన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం ప్రారంభించిన డిజిటల్ ఇండియా, స్వచ్ఛ భారత్ ప్రచార కార్యక్రమాల పురోగతిని ప్రధాని ఈ సందర్భంగా సమీక్షించారు. నిర్భయంగా నిర్ణయాలు తీసుకోవాలని, తన పూర్తి మద్దతు ఉంటుందని కార్యదర్శకులకు భరోసా ఇచ్చారు.
‘‘మంచి పనులు జరగడం మొదలైంది. పాలనలో పారదర్శకత తీసుకొచ్చి మరింత కలసికట్టుగా పనిచేద్దాం’’ అని పిలుపునిచ్చారు. అవినీతి నిరోధక చట్టం కింద తమకు రక్షణ లేదని పలువురు కార్యదర్శులు మోదీ దృష్టికి తీసుకురాగా సరైన నిర్ణయాలు తీసుకున్న వారికి అండగా ఉంటానని ప్రధాని వారికి హామీ ఇచ్చారు. బడ్జెట్ సంబంధ ప్రక్రియలను మూడు నెలల ముందుగానే చేపట్టాలని...దీనివల్ల వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి రోజు నుంచే బడ్జెట్ అమలు కార్యకలాపాలు నిర్వహించడం వీలవతుందన్నారు.