న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయం నిర్మాణాన్ని సవాల్ చేస్తూ జాతీయ హరిత ట్రిబ్యునల్‌లో దాఖలైన పిటిషన్‌పై విచారణ అక్టోబర్ 31కి వాయిదా పడింది. తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి సంబంధించిన పర్యావరణ అనుమతులను సవాల్ చేస్తూ మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను ధర్మాసనం మంగళవారం విచారించింది.
ఈ కేసులో కేంద్ర పర్యావరణ అనుమతులకు సంబంధించిన వివరాలను సమర్పించడానికి పిటిషనర్ తరఫు న్యాయవాది రెండు వారాల గడువుకోరడంతో ధర్మాసనం అందుకు అంగీకరించింది. అలాగే ఈ కేసుపై స్పందించడానికి కేంద్ర పర్యావరణ, అటవీ శాఖకు గడువునిస్తూ విచారణను అక్టోబర్ 31కి వాయిదా వేసింది.