
నడుం విరగగొట్టి.. సంచిలో కుక్కి!
ఒడిశాలో మరో అమానవీయ ఘటన జరిగింది. బాలాసోర్ జిల్లాలో సోరో పట్టణం. 80ఏళ్ల అవ్వ సాలామణి బారిక్ బుధవారం రైలు ఢీకొని చనిపోయింది.
ఒడిశాలో మృతదేహాన్ని తరలించిన తీరు
బాలాసోర్: ఒడిశాలో మరో అమానవీయ ఘటన జరిగింది. బాలాసోర్ జిల్లాలో సోరో పట్టణం. 80ఏళ్ల అవ్వ సాలామణి బారిక్ బుధవారం రైలు ఢీకొని చనిపోయింది. ఆమె మృతదేహం స్థానిక ఆరోగ్య కేంద్రం వద్ద గంటల తరబడి పడిఉంది. పోస్ట్‌మార్టమ్ కోసం 30 కి.మీ. దూరంలోని జిల్లా ఆస్పత్రికి తరలించాలి. రైల్లో పంపాలని నిర్ణయించారు. ఆరోగ్య కేంద్రం నుంచి స్టేషన్ రెండు కి.మీ. దూరం ఉంది. తరలించే పని ఆస్పత్రి కార్మికులకు అప్పజెప్పారు. ముగ్గురు కార్మికుల్లో ఒకరు మృతదేహంపై నిలబడి నడుము వద్ద కాళ్లతో తొక్కుతూ ఎముకలు విరగగొట్టాడు.
మిగతా ఇద్దరూ మృతదేహాన్ని మడతపెట్టి ఒక సంచిలో మూటగట్టి వెదురుబొంగు కు కట్టి దాన్ని భుజాన మోస్తూ బయల్దేరారు. ఈ ఘోరానికి సంబంధించిన వీడియో శుక్రవారం సంచలనం సృష్టించింది. దీనిపై రాష్ట్ర మానవ హక్కుల సంఘం.. రైల్వే, బాలాసోర్ జిల్లా అధికారులను వివరణ అడిగింది. కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పారు. అంబులెన్స్‌ల కొరత వల్లే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని.. అన్ని జిల్లాల్లో అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచాలని కేంద్రమంత్రి మేనకాగాంధీ పేర్కొన్నారు.