
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్‌సభ సభ్యుడు అధిర్ రంజన్ చౌదరి.. నిర్మలా కాదు నిర్బల అంటూ చేసిన వ్యాఖ్యలపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఘాటుగా స్పందించారు. పార్లమెంట్‌లో తనను అనేక పేర్లతో పిలిచారని ఆమె పేర్కొన్నారు. తాను ఒక ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టలేని ఆర్థికమంత్రిని అంటూ గత కొంతకాలంగా కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారని, తన పదవీకాలం పూర్తయ్యే వరకు కూడా వాళ్లు ఆగలేకపోతున్నారని విమర్శించారు. ఆర్థికవ్యవస్థను పరుగులు పెట్టించేందుకు అవసరమైన మరిన్ని సలహాలు ఇవ్వాలని తాను వారికి చెప్పానన్నారు. ఏదైనా విని సమాధానం ఇచ్చే ప్రభుత్వం ఉంటే అది మోడీ ప్రభుత్వమేనని కాంగ్రెస్ నాయకులకు ఆమె చురకలంటించారు.
ప్రశ్నలు అడిగి, సమాధానం చెప్పేలోగా పారిపోయే డీఎన్ఏ ఎవరికైనా ఉందంటే అది ఇతర పార్టీలకని, తమ పార్టీకి కాదని ఆమె అన్నారు. వ్యాపారవేత్త రాహుల్ బజాజ్ చేసిన విమర్శలపై కూడా ఆమె స్పందిస్తూ.. విమర్శలను స్వీరించే మనస్తత్వం ఉంది కాబట్టే విమర్శను విన్నాము. దానిని పరిగణనలోకి తీసుకొని సమాధానం కూడా చెప్పాము. విమర్శను స్వీకరించే గుణమే లేకపోతే.. వారి అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వెలిబుచ్చే అవకాశమే ఇచ్చేవాళ్లం కాదని ఆమె సమాధానమిచ్చారు.