
‘బగ్గింగ్’ ఉత్తదే: కేంద్రం
కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ నివాసంలో నిఘా పరికరాలు లభ్యమైనట్లు వచ్చిన వార్తలను హోంశాఖ ఖండించింది. ఇవన్నీ ఊహాగానాలని గడ్కారీ కూడా ఇప్పటికే తోసిపుచ్చారని, దీనిపై ఎలాంటి విచారణకు ఆదేశించలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరన్ రిజ్జూ స్పష్టం చేశారు
గడ్కారీ నివాసంలో నిఘా పరికరాలు దొరకలేదు
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ నివాసంలో నిఘా పరికరాలు లభ్యమైనట్లు వచ్చిన వార్తలను హోంశాఖ ఖండించింది. ఇవన్నీ ఊహాగానాలని గడ్కారీ కూడా ఇప్పటికే తోసిపుచ్చారని, దీనిపై ఎలాంటి విచారణకు ఆదేశించలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరన్ రిజ్జూ స్పష్టం చేశారు. గడ్కారీ స్వయంగా ఈ ఆరోపణలను ఖండించినందున ఇక ఇందులో తాము స్పందించటానికి ఏముందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సోమవారం ప్రశ్నించా రు.
తన నివాసంలో ఎక్కడా బగ్గింగ్ పరికరాలు దొరకలేదని గడ్కారీ పునరుద్ఘాటించారు. కాగా, ఈ అంశంపై విచారణ జరపాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ పేర్కొన్నారు. ‘ఇది మంత్రివర్గంలో కీలక వ్యక్తి భద్రతతో ముడిపడ్డ అంశం. ఆయనకే ఇలా జరిగితే దేశాన్ని భగవంతుడు కూడా రక్షించలేరు’ అన్నారు. ఇందులో ప్రధాని కార్యాలయం లేదా ఇతర శక్తుల ప్రమేయం ఉందేమో బహిర్గతం చేయాలని ఎన్సీపీ డిమాండ్ చేసింది.