గుజరాత్ సీఎం ఈయనేనంట!
గాంధీనగర్: అనూహ్యంగా ఖాళీ అయిన గుజరాత్ సీఎం పీఠాన్ని రాష్ట్ర బీజేపీ సీనియర్ నేత, ఆనందీ బెన్ పటేల్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన నితిన్ పటేల్ అధిరోహించనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర అధికార వర్గంతో రాష్ట్ర ఎమ్మెల్యేలు భేటీ కానున్న కొన్ని గంటలముందు కీలక వర్గాలు ఈ సమాచారం వెల్లడించాయి. నితిన్ పటేల్ ఉత్తర గుజరాత్లో బలమైన నాయకుడు. ఆయన తొలిసారి గుజరాత్ అసెంబ్లీకి 1999 ఎన్నికయ్యారు. మొత్తం నాలుగుసార్లు ఎమ్మెల్యే అయ్యారు.
మొన్న ఆనందీ బెన్ ప్రభుత్వంలో ఆరోగ్యశాఖ నిర్వహించారు. కేబినెట్ మంత్రిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఉన్న మంత్రి వర్గ సభ్యులందరికన్నా ఈయనే సీనియర్ కూడా. అయితే, ఈయనకు పటేల్ సామాజిక వర్గం కొంత దూరంగా ఉంటుంది. ఉద్యోగాల విషయంలో రిజర్వేషన్లను ఇప్పించాలనే డిమాండ్ తోనే పటేళ్ల ఉద్యమం వచ్చిన విషయం తెలిసిందే. సీఎం పీఠం మార్పునకు కూడా ఈ ఉద్యమం, దళితుల ఉద్యమం ఓ కారణమైంది.
కొత్త సీఎం అభ్యర్థిని ప్రకటించడానికి ముందు నితిన్ పటేల్ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పటేళ్ల ఆందోళన సమస్యను అదిగమిస్తామన్నారు. 'పటేళ్ల వర్గం నాయకులతో మాట్లాడతాం. హర్థిక్ పటేల్, లాల్జీ, ఇతర నేతలందరితో సమస్యపై చర్చిస్తాం. దళితుల ఆందోళనను గుజరాత్ ప్రభుత్వం నియంత్రించలేక పోయిందనడం సరికాదు. ఆనందీ బెన్ పటేల్ ఆమె పనిచేసిన 26 నెలలు ఎంతో కష్టపడి పనిచేశారు' అని చెప్పారు.