
'నితీష్ ఇంత ఇబ్బంది జీవితంలో చూడలేదు'
పట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ కూటమి రెండుగా చీలే సమయం దగ్గరపడిందా? బిహార్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటాయా? అనే అంశాలపై తీవ్ర చర్చ నడుస్తోంది. ముఖ్యంగా శుక్రవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇది కాస్త తారాస్థాయికి వెళ్లింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మాత్రం తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు తెలుస్తోంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న డిప్యూటీ సీఎం లాలూ తనయుడు తేజస్వీ యాదవ్‌పై సమావేశాలకు ప్రారంభం ముందే ఆయన వేటు వేస్తారా.. లేక సర్దుబాటు చర్యలకు దిగుతారా అని తీవ్ర స్థాయిలో రాజకీయ చర్చ జరుగుతోంది.
మీడియాలో మాత్రం ఆయన సమావేశాలకు ముందే తేజస్వీపై చర్యలు తీసుకుంటారని చర్చ నడుస్తోంది. ఎందుకంటే బుధవారం నితీశ్, లాలూ పార్టీలు వేర్వేరుగా తమ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశాలకు పిలుపునిచ్చాయి. శుక్రవారం జరిగే అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ ఆందోళన మొదలుపెడితే తేజస్వీని రక్షించే విషయంలో నితీష్ సంకోచిస్తారని సన్నిహిత వర్గాల సమాచారం. ఇప్పటి వరకు అవినీతి విషయంలో ఏ మాత్రం రాజీ పడరని పేరున్న నితీష్ తాజా విషయంలో కూడా అలాగే వ్యవహరిస్తారని చెబుతున్నారు. అయితే, ఏదీ ఏమైనా తన మొత్తం రాజకీయ జీవితంలోనే ఇలాంటి పరిస్థితిని నితీష్ ఎప్పుడూ ఎదుర్కోలేదని జేడీయూ సెక్రటరీ జనరల్ కేసీ త్యాగి చెప్పారు.