నితీశ్ పరువు తీస్తున్న మంత్రులు
పాట్నా: సాధారణంగా రాజకీయ పదవుల్లో ఉండే నాయకు ఆ దర్జాయే వేరు. మిగితా సామాన్య ప్రజలకు ఒక కలగా మాత్రమే మిగిలిపోయే ఆశలు, అవకాశాలు, అతిథి మర్యాదలు ఇట్టే వారికి అందుతాయి. అయినప్పటికీ కొంతమంది నాయకులకు మాత్రం అవి చాలదన్నట్లు పక్కదార్లు పడుతుంటారు. ఐదేళ్ల వరకు తమను ఎవరూ ఏం చేయలేరనే తీరుగా వ్యవహరిస్తుంటారు. బిహార్‌లో కొంతమంది మంత్రులు ఇప్పుడు అదే చేస్తున్నారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పరువు తీస్తున్నారు. ఏకంగా ప్రభుత్వ బంగళాలను డబ్బులకు కక్కుర్తిపడి అద్దెకు ఇస్తున్నారు.
కేవలం ప్రభుత్వ కార్యక్రమాలే నిర్వహించాల్సిన ఆ భవనాల్లో ప్రైవేటు కార్యక్రమాలకు అనుమతిస్తూ అవాక్కయ్యేలా చేస్తున్నారు. ఓ టీవీ చానెల్ ఈ గుట్టును బయటపెట్టింది. పెళ్లిళ్ల కార్యక్రమాలతోపాటు తదితర కార్యక్రమాలు వాటిల్లో నిర్వహిస్తున్నారు. మైనారిటీ వ్యవహారల మంత్రి అబ్దుల్ గఫూర్ అనే ఆర్జేడీ పార్టీ ఎమ్మెల్యే తన ఆధీనంలో ఉన్న ప్రభుత్వ బంగళాను ఇప్పుడు ఓ వివాహ వేడుకకు అద్దెకు ఇచ్చారు. ప్రస్తుతం అక్కడ అన్ని టెంట్లు, కటౌట్‌లు వెలిశాయి. ఒక్క రోజు అద్దెగా రూ.2.5లక్షలతోపాటు ఇతర సౌకర్యాలు తగిన మొత్తం చెల్లిస్తే అందిస్తున్నారంట.
బంగ్లా లోపల ఉండే ఎయిర్ కండిషన్ గదులు పెళ్లి కూతురు, పెళ్లి కొడుక్కి ఎక్కువ మొత్తానికి ఇస్తున్నట్లు ఆ బంగ్లాలకు కాపలా కాస్తున్న సెక్యూరిటీలు చెబుతున్నారు. వీరే పెళ్లిల్ల బ్రోకర్లు తీసుకొచ్చే సమాచారాన్ని సంబంధిత మంత్రులకు చేరవేసి అనుమతులు ఇప్పిస్తున్నారంట. అయితే, దీనిపై వివరణ ఇవ్వగా సదరు మంత్రి కస్సుమన్నాడు. పెళ్లి చేసుకునేందుకు చోటుదొరకక ఇబ్బంది పడుతున్న వారికి తాను బాధ్యతతో సహాయం చేస్తున్నానంటూ సమర్థించుకున్నారు. తాను ఉంటున్న బంగ్లా వెనుక చాలా ఖాళీ ప్రదేశం ఉందని, వృధాగానే ఉంటుంది కదా సహాయం చేసినట్లవుతుందని తాను అలా చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.