సాక్షి, ముంబై: మంత్రి పదవికి రాజీనామా చేసి వారంరోజులు దాటినా నారాయణ్ రాణేకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఎలాంటి ఆఫర్లు రాలేదు. కనీసం అధిష్టానం నుంచి పిలుపు కూడా రాకపోవడంపై రాణే వర్గీయుల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి పనితీరుతోపాటు రాష్ట్ర కాంగ్రెస్‌పై తిరుగుబాటు ప్రకటించిన రాణే వారంరోజుల క్రితం మంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసింది.
రాజీనామా చేయడం ద్వారా ముఖ్యమంత్రి పథ్వీరాజ్ చవాన్‌తోపాటు రాష్ట్ర కాంగ్రెస్‌పై ఒత్తిడి తీసుకువచ్చేందుకు నారాయణ్ రాణే వ్యూహం ఫలించినట్టు కన్పించడంలేదు. పైగా బెడిసికొట్టిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజీనామా అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాణే తన డిమాండ్లను వినిపించిన సంగతి కూడా తెలిసిందే.
అయితే అదే రోజు రాత్రి వర్షా బంగ్లాలో ఎంపీసీసీ అధ్యక్షులు మాణిక్‌రావ్ ఠాక్రే, ముఖ్యమంత్రి పథ్వీరాజ్ చవాన్, రాణే సమావేశం కావడం, ఆ సమావేశంలో కూడా రాణే తన డిమాండ్లను వారి ముందుంచినట్లు వార్తలు వెలువడ్డాయి. రాణే డిమాండ్లను పార్టీ అధిష్టానానికి తెలియజేస్తామని చెప్పడంతో అప్పటికి సంతృప్తి వ్యక్తం చేసిన రాణేకు నిరాశే ఎదురైంది. రాణే డిమాండ్లపై అధిష్టానం నుంచి స్పందన కరువైంది. పరిస్థితిని ముందే గమనించిన రాణే స్వయంగా గురువారం ఢిల్లీ బాటపట్టారు.
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అయ్యేందుకు వెళ్లిన ఆయన రాహుల్ గాంధీతో భేటీ అయిన అనంతరం వెనుతిరగాల్సివచ్చింది. ముఖ్యంగా రెవెన్యూశాఖ మంత్రి పదవితోపాటు , పార్టీ రాష్ట్రాధ్యక్ష పదవి కావాలని రాహుల్ గాంధీని కోరారని, అప్పటికి రాహుల్ నుంచి ఎటువంటి హామీ లభించకపోయినా సోనియాతో మాట్లాడతానని మాత్రమే రాహుల్ సమాధానమిచ్చి తిప్పి పంపినట్లు ఢిల్లీ కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఇది జరిగి కూడా అయిదు రోజులు పూర్తయింది. అయినప్పటికీ రాణే డిమాండ్లపై కాంగ్రెస్ అధిష్టానం ఇంత వరకు నోరు విప్పలేదు. దీంతో రాణే వర్గీయుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. దీనిపై రాణే కూడా మరో ఆలోచన చేస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెప్పుకుంటున్నారు.
రాణే..కు పిలుపు రాలే!
Published Mon, Jul 28 2014 11:17 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement