రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఠాక్రేతో రేవంత్‌రెడ్డి, భట్టి
సాక్షి, హైదరాబాద్: మరికొన్ని నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమయ్యేందుకు కాంగ్రెస్ పార్టీ త్రిముఖ వ్యూహాన్ని రూపొందిస్తోంది. వివిధ వర్గాల వారీగా హామీలతో డిక్లరేషన్ల ప్రకటన.. బస్సు యాత్ర ద్వారా కాంగ్రెస్ నేతల్లో ఐక్యతను చాటడం.. సభలు, సమావేశాల ద్వారా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడం లక్ష్యంగా కార్యక్రమాలను సిద్ధం చేస్తోంది. దీనికి సంబంధించి ఆదివారం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే అధ్యక్షతన గాందీభవన్‌లో టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది.
ఈ సందర్భంగా నేతలు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బీఆర్‌ఎస్ వైఫల్యాలను, బీజేపీ–బీఆర్‌ఎస్ మధ్య స్నేహాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగట్టడంతోపాటు.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏయే వర్గాలకు ఎలా లబ్ధి చేకూరుస్తుందన్న దానిపై విస్తృత ప్రచారం కల్పించాలని తీర్మానించారు. దీనిపై ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందించాలని, కర్ణాటక తరహాలో ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించారు. ఇక మణిపూర్‌లో జరిగిన దారుణ ఘటనలను ఖండిస్తూ.. ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని సస్పెండ్ చేయాలన్న డిమాండ్‌తో తీర్మానం చేశారు.
ఆగస్టు 15 నుంచి బస్సు యాత్ర!
ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్త బస్సుయాత్రపై కాంగ్రెస్ నేతలు చర్చించారు. వీలున్నంత త్వరగా బస్సు యాత్ర చేపట్టాలని, ఆగస్టు 15 నుంచి మొదలుపెడితే బాగుంటుందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సూచించారు. మరికొందరు నేతలూ తమ అభిప్రాయాలను వెల్లడించారు. దీనితో బస్సు యాత్రను ఎప్పుడు మొదలుపెట్టాలి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఎవరెవరి ఆధ్వర్యంలో చేపట్టాలన్న దానిపై చర్చించి, నిర్ణయం తీసుకునేందుకు సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని భేటీలో నిర్ణయించారు. సబ్ కమిటీ గతంలో జరిగిన బస్సుయాత్రలపై అధ్యయనం చేసి ప్రతిపాదనలు, సూచనలు చేయాలని.. ఆ తర్వాత రూట్‌మ్యాప్ ఖరారు చేద్దామని తీర్మానించారు.
డిక్లరేషన్లపైనా సబ్ కమిటీ
రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళల కోసం డిక్లరేషన్లను ప్రకటించేందుకు నిపుణులు, మేధావులు, పార్టీ నేతలతో ఓ కమిటీ వేయాలని కాంగ్రెస్ పీఏసీ నిర్ణయించింది. రెండు రోజుల్లో ఈ కమిటీని ఏర్పాటు చేయాలని, పార్టీ అధికారంలోకి వస్తే ఆయా వర్గాల కోసం ఏం చేస్తామన్న దానిపై ఈ కమిటీ సూచనలు చేయాలని నిర్ణయించారు.
ప్రియాంకా గాందీతో సభ
మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతోపాటు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన పలువురు ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్‌లో చేరేందుకు ఈ నెల 30న కొల్లాపూర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని.. ఆ సభకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీని ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని భేటీలో నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ఇప్పటికే ఏఐసీసీ అనుమతి కూడా లభించినందున సభ ఏర్పాట్లపైనా చర్చించారు. అనంతరం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల గర్జన పేరుతో ఆగస్టు 15న బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు.
దానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఆహ్వానించాలని.. ఆ వేదికపైనే ఆయా వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందన్న డిక్లరేషన్లు ప్రకటించాలని తీర్మానించారు. ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీనియర్ నేతలు పొన్నాల లక్ష్మయ్య, వి.హనుమంతరావు, మధుయాష్కీగౌడ్, షబ్బీర్‌అలీ, దామోదర రాజనర్సింహ, జీవన్‌రెడ్డి, అంజన్‌కుమార్‌యాదవ్, జానారెడ్డి, రేణుకాచౌదరి, సంపత్‌కుమార్, శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, మహేశ్‌కుమార్‌గౌడ్, బలరాం నాయక్, చిన్నారెడ్డి, పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు తదితరులు పాల్గొన్నారు.
85 చోట్ల బలంగా.. ఎక్కడెక్కడ ఎలా?
పీఏసీ భేటీలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు ‘మిషన్–2023’ పేరుతో సుదీర్ఘంగా ఓ ప్రజెంటేషన్ ఇచ్చారు. చాలా నియోజకవర్గాల్లో పార్టీ బలంగా ఉన్నప్పటికీ, కొన్నిచోట్ల అనివార్య బలహీనతలు పార్టీని వెంటాడుతున్నాయని స్పష్టం చేశారు. లోక్‌సభ నియోజకవర్గాలు, వాటి పరిధిలోని అసెంబ్లీ స్థానాల ప్రాతిపదికన పార్టీ పరిస్థితిని వివరించారు.
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. రాష్ట్రంలో 12 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ఉన్న 85 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పరిస్థితి బాగానే ఉందని.. కానీ హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, ఆదిలాబాద్, నిజామాబాద్ లోక్‌సభ స్థానాల్లో చాలాచోట్ల కనీస పోటీ ఇచ్చే స్థితిలో కూడా పార్టీ లేదని పేర్కొన్నారు. ఈ నియోజకవర్గాలకోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు.
పార్టీ తరఫున ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన పలు అంశాలను ఆయన సూచించగా.. వాటిపై ప్రచార కమిటీలో చర్చించి తగిన నిర్ణయం తీసుకోవాలని పీఏసీ భేటీ నిర్ణయించింది. ఇక భేటీలో మాజీ ఎంపీ రేణుకా చౌదరి మాట్లాడుతూ.. దశాబ్దాలుగా పార్టీలో పనిచేస్తున్న నేతలకు తగిన గుర్తింపు ఇవ్వడం లేదని, పార్టీ నేతలతో మర్యాదగా నడుచుకోవాల్సిన కొందరు కనీసం తమ ఫోన్లు ఎత్తడం లేదని పేర్కొన్నట్టు తెలిసింది.
మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ.. పార్టీ పక్షాన ప్రజలకు హామీలివ్వడంతోపాటు గత తొమ్మిదేళ్లలో బీఆర్‌ఎస్ చేసిన అన్యాయాలను ప్రజలకు వివరించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించినట్టు సమాచారం. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. రానున్న 100రోజుల పాటు పార్టీ కేడర్ పూర్తిగా ప్రజల్లోనే ఉండేలా కార్యాచరణ రూపొందించాలని, ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో రెండు అసెంబ్లీ సీట్లను బీసీలకు ఇచ్చేలా ప్లాన్ చేయాలని సూచించినట్టు తెలిసింది. వీరితోపాటు ఇతర నేతలు ప్రస్తావించిన పలు అంశాలపైనా పీఏసీ సమావేశంలో చర్చించారు.
బీఆర్‌ఎస్ వైఫల్యాలను ఎండగడతాం: మధుయాష్కీ, షబ్బీర్‌అలీ
పీఏసీ సమావేశం అనంతరం ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ, పీఏసీ కన్వీనర్ షబ్బీర్‌అలీ మీడియాతో మాట్లాడారు. సమావేశంలో తీసుకున్న పలు నిర్ణయాలను వెల్లడించారు. తొమ్మిదేళ్లుగా బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బడుగు, బలహీన వర్గాలకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక ఆయా వర్గాలకు న్యాయం చేస్తామని చెప్పారు.
చేయూత పేరుతో తాము ప్రకటించిన రూ.4వేల పింఛన్ హామీ ఇప్పుడే ప్రభావం చూపిస్తోందని.. తమ హామీని చూసి రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు రూ.4,016 పింఛన్‌ను అమల్లోకి తెచ్చిందని చెప్పారు. ఇక షబ్బీర్‌అలీ మాట్లాడుతూ.. ఇతర పార్టీల నేతల చేరికలపై పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉంటాయని, వాటిపై పార్టీలో అంతర్గతంగా మాట్లాడుకుని పరిష్కరించుకుంటామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment