సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఏడాది కాలం తర్వాత కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గాంధీభవన్‌లో అడుగుపెట్టారు. ఈ క్రమంలో గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మాణిక్‌రావు ఠాక్రేతో కూడా కోమటిరెడ్డి భేటీ అయ్యారు.
వీరి భేటీ అనంతరం కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గాంధీభవన్ ఎదుట వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలో గౌరవం దక్కాలి. అందరి సమిష్టి నిర్ణయాలు ఉండాలి. ఇవన్నీ జరిగితే నేను మరింత ఉత్సాహంతో పనిచేస్తాను అని చెప్పాను. కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు విశ్వాసం ఉంది. రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేయాలని ప్రజల మనసులో ఉంది. హాత్ సే జోడో యాత్ర ఎలా చేయాలనే అంశంపై చర్చించాము.
అంతర్గత విషయాలను పక్కనపెట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థులను ఎంపిక చేయాలని కోరాను. 50 శాతం టికెట్స్ ముందే ఇవ్వాలని సూచించాను. గాంధీభవన్‌కు రావడం తగ్గించి నియోజకవర్గాల్లో ఎక్కువ సమయం ఉండాలి. ఇన్‌ఛార్జ్ కూడా జిల్లాల వారీగా తిరగాలని చెప్పాను. నియోజకవర్గాల్లో ఒకవేళ ఎక్కువ పోటీ ఉంటే వారిని కూర్చోబెట్టి మాట్లాడాలని సూచనలు చేశాను. జన సమీకరణ చేసి ఉద్యమాలు చేయాలని కోరాను. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎలా ఎదుర్కోవాలో చర్చించినట్టు తెలిపారు. ఇప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్‌కు 40-50 సీట్లు వస్తాయి. నాకు, రేవంత్‌కు మధ్య ఎలాంటి విభేదాలు లేవు. కాంగ్రెస్ బలమైన పార్టీ. బీఆర్‌ఎస్ వైఫల్యాలపై పోరాడుతాము అని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment