
ఇక హెల్మెట్ లేదో పెట్రోల్ బందే
కటక్: రోడ్డు రవాణ భద్రతా చర్యల్లో భాగంగా ఒడిశాలోని కటక్ పోలీసులు ఒక కొత్తకార్యక్రమానికి తెరతీశారు. ఇక హెల్మెట్ లేకుండా పెట్రోల్ పోయవద్దని పెట్రోల్ బంక్ యజమానులకు స్ట్రిట్ ఆదేశాలు జారీ చేయనున్నారు. జూలై 1 నుంచి ఈ నిబంధన అమలుకానుంది. దీంతో ఇక హెల్మెట్ లేకుండా బైక్ నడపాలన్నా సాధ్యం కాదన్నమాట. అయితే, ఇందుకోసం ముందుగానే ఈ నెల 20 నుంచి ప్రజల్లో అవగాహన కార్యక్రమం కల్పించనున్నారు.
'అన్ని పెట్రోల్ బంక్లకు, విద్యాసంస్థలకు, ప్రభుత్వ కార్యాలయాలకు, పూజా కమిటీలకు వారి సహాయాన్ని అందించాలని లేఖలు రాస్తున్నాం. నో హెల్మెట్ నో పెట్రోల్ కార్యక్రమం విజయవంతం చేయాలని లేఖలో కోరుతున్నాం' అని కటక్ డీసీపీ సంజీవ్ అరోరా చెప్పారు. అయితే, పెట్రోల్ బంక్ యజమానులు ఇప్పటికే తమకు హామీ ఇచ్చినట్లు చెప్పారు. తమ ప్రత్యేక బృందాలు కూడా బంక్ ల పనితీరుపై ఓ కన్నేసి ఉంచుతాయని చెప్పారు. ప్రజల ప్రాణాల రక్షణే తమ ప్రథమ కర్తవ్యంగా తాము ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.