మల్లన్న సాగర్ భారీ రిజర్వాయర్ అవసరం లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.
న్యూఢిల్లీ: మల్లన్న సాగర్ భారీ రిజర్వాయర్ అవసరం లేదని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. బుధవారం న్యూఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టుకు రైతుల నుంచి నిర్బంధంగా భూసేకరణ చేస్తున్నారంటూ రాష్ట్రపతికి కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. సమావేశం ముగిసిన అనంతరం ఉత్తమ్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.
భూసేకరణలో తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని ఆరోపించారు. ఈ విషయంలో రాష్ట్రపతి ప్రణబ్ వెంటనే జోక్యం చేసుకోవాలని కోరినట్టు తెలిపారు. రైతులను భయపెట్టి, 144 సెక్షన్ విధించి భూములను లాక్కుంటున్నారని ఉత్తమ్ విమర్శించారు.