బ్రెడ్ గురించి భయపడొద్దు
బ్రెడ్‌లో ప్రమాదకరమైన రసాయనాలు ఉంటాయని, వాటివల్ల కేన్సర్ వస్తుందని వస్తున్న కథనాల గురించి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఎంసీ మిశ్రా అన్నారు. ప్రతిరోజూ పూర్తి బ్రెడ్ ప్యాకెట్ ఎవరూ తినరని, మహా అయితే ఒకటి లేదా రెండు ముక్కలు మాత్రమే తింటారు కాబట్టి దాని గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. అందరికీ ఆరోగ్యభద్రత అనే అంశంపై అసోచాం ఏర్పాటు చేసిన సదస్సు ప్రారంభం సందర్భంగా డాక్టర్ మిశ్రా ఈ విషయాలు తెలిపారు.
ఆహార పదార్థాల్లో రసాయన పదార్థాలకు బదులు కోడిగుడ్లు, పండ్లు, కూరగాయల వాడకాన్ని పెంచాలని, దాంతోపాటు ఏం తిన్నా.. పరిమితంగానే తినాలని ఆయన చెప్పారు. ప్రతి ఒక్కరూ వైద్యబీమా చేయించుకోవాలని, రోజుకు రూపాయి గానీ, పది రూపాయలు గానీ.. వాళ్ల సామర్థ్యాన్ని బట్టి పాలసీ తీసుకోవాలని, ఈ విషయంలో అసలు ఏమీ కట్టలేని వాళ్లకు ప్రభుత్వమే ప్రీమియం కట్టి వైద్యబీమా కల్పించాలని ఆయన సూచించారు.