
'పోలవరం ఎత్తు పెంచేది లేదు'
ఢిల్లీ: అనుకున్న గడువులోగా పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తామని కేంద్ర మంత్రి ఉమాభారతి స్పష్టంచేశారు. న్యూఢిల్లీలో ఆమె మంగళవారం మీడియాతో మట్లాడారు. పోలవరం ప్రాజెక్టు అంశంపై మాట్లాడేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఢిల్లీకి ఆహ్వానించానమని ఆమె తెలిపారు. పోలవరం డ్యామ్ ఎత్తు పెంచేది లేదని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. పోలవరం నిర్మాణానికి కేంద్ర బడ్జెట్ లో రూ.100 కోట్లు కేటాయించామన్నారు.
పోలవరానికి రూ.1600 కోట్లు ఇవ్వాలనేది తమ ప్రభుత్వ ఆలోచన అని చెప్పారు. నాబార్డ్ నుంచి ఆ నిధులు తీసుకునే అవకాశం ఉందన్నారు. తెలంగాణలో మిషన్ కాకతీయ ప్రాజెక్టులకు సహాయం అందిస్తామని ఆమె పేర్కొన్నారు. చెరువుల పునరుద్ధరణకు సంబంధించిన కేంద్ర పథకాలతో నిధులు అందిస్తామని వెల్లడించారు. భూగర్భ జలాల పరిరక్షణకు రూ.6 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నామని.. కాలుష్య నివారణ, భూగర్భ జలాల రీఛార్జ్ కోసం ఖర్చుచేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని జలవనరులశాఖ మంత్రి ఉమాభారతి వివరించారు.