'చైనాపై ఒక్క బుల్లెట్ కూడా పేల్చలేదు'
సెయింట్ పీటర్స్‌బర్గ్: తీవ్ర సరిహద్దు వివాదం ఉన్నా గత 40 సంవత్సరాల్లో చైనా సరిహద్దులో ఒక్క బుల్లెట్ కూడా పేల్చలేదని భారత్ ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. రష్యా పర్యటనలో భాగంగా ఆయనపై వ్యాఖ్యలు చేశారు. ఓబీఓర్ ప్రాజెక్టు భారత్ సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తుందని చెబుతూ కార్యక్రమానికి హాజరుకాకపోవడంపై ఎదురైన ప్రశ్నకు 'చైనాతో మాకు సరిహద్దు వివాదం ఉన్న మాట నిజమే. కానీ గత 40 ఏళ్లుగా సరిహద్దు వివాదం కారణంగా ఒక్క బుల్లెట్ కూడా పేలలేదు' అని సెయింట్ పీటర్స్‌బర్గ్ ఎకనమిక్ ఫోరమ్‌లో మోదీ సమాధానమిచ్చారు.
ఒకప్పటిలా అమెరికా పంచనో లేక సోవియట్ యూనియన్ పంచనో దేశాలు చేరే కాలం పోయిందని అన్నారు. నేడు ప్రతి దేశం మిగిలిన ప్రపంచదేశాలతో సత్సంబంధాలను కోరుకుంటోందని చెప్పారు. కొద్ది దేశాలతో సమస్యలు ఉన్నా సంబంధాలు మాత్రం చెడిపోవడం లేదని అన్నారు. అందుకు వ్యాపార ధోరణేనని చెప్పారు. భారత్-రష్యాల మధ్య ఉన్న సంబంధం నమ్మకంతో కూడుకున్నదని చెప్పారు. ఎన్నో కఠిన సమయాల్లో కూడా ఈ సంబంధం చెడిపోలేదని తెలిపారు.
భారత్-రష్యాల మధ్య కుదిరిన సెయింట్ పీటర్స్‌బర్గ్ డిక్లరేషన్ గురించి ప్రస్తావిస్తూ.. ఒప్పందంలో ఉన్న ప్రతి అక్షరాన్ని ప్రపంచదేశాలు పరిగణలోకి తీసుకుంటాయని తనకు తెలుసునని అన్నారు.