
బీజేపీలోకి ప్రముఖ సంగీత దర్శకుడు
ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు, ఇళయరాజా సోదరుడు గంగై అమరన్ బీజేపీలో చేరబోతున్నారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఆయన చేరనున్నట్లు సమాచారం. తొలిసారి తమిళనాడు పర్యటనకు వస్తున్న అమిత్ షా ఓ బహిరంగ సభలో పాల్గొంటున్న సందర్భంగా గంగై అమరన్ను చేర్చుకోడానికి తమిళనాడు బీజేపీ శ్రేణులు పూర్తిస్థాయిలో సన్నాహాలు చేసుకున్నాయి. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావుతోను, తమిళనాడు శాఖ అధ్యక్షుడు తమిళసై సౌందరరాజన్తోను ఇప్పటికే అమరన్ మాట్లాడారు.
ఇక గంగై అమరన్తో పాటు పలువురు ప్రముఖులు కూడా శనివారం నాడు జరిగే కార్యక్రమంలో కమలనాథుల దళంలో చేరుతారని బీజేపీ సీనియర్ నాయకుడు ఒకరు తెలిపారు. గంగై కేవలం సంగీతదర్శకుడే కాదు.. పాటల రచయిత, సినిమా నిర్మాతగా కూడా ఉన్నారు. రాష్ట్రంలో అన్నాడీఎంకే, డీఎంకేలకు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు బీజేపీ శాయశక్తులా ప్రయత్నిస్తోంది. అందుకే ప్రముఖులను పార్టీలో చేర్చుకుని ఈసారి ఎంతోకొంత ప్రభావం చూపాలనుకుంటోంది.