జేడీయూ, ఆర్‌ఎల్‌డీ, జేవీఎంపీ, ఎస్‌జేపీఆర్ విలీనంపై కసరత్తు
న్యూఢిల్లీ: ఉత్తరాదిన జనతా పరివార్ పేరిట జేడీయూ, ఆర్జేడీ తదితర పార్టీల విలీన ప్రయోగ వైఫల్యం తర్వాత తాజాగా మరో విలీన ప్రక్రియ తెరపైకి వచ్చింది. ఈసారి బిహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్‌లలో జేడీయూ, రాష్ట్రీయ లోక్‌దళ్(ఆర్‌ఎల్‌డీ), జార్ఖండ్ వికాస్ మోర్చా-ప్రజాతాంత్రిక్ (జేవీఎంపీ), సమాజ్‌వాది జనతా పార్టీ- రాష్ట్రీయ(ఎస్‌జేపీఆర్)లు విలీనంవైపు అడుగులు వేస్తున్నాయి.
కొత్త పార్టీ ఏర్పాటుకోసం బిహార్ సీఎం నితీశ్ కుమార్, జేడీయూ చీఫ్ శరద్ యాదవ్, ఆర్‌ఎల్‌డీ చీఫ్‌అజిత్ సింగ్, ఆయన కుమారుడు జయంత్, ఎన్నికల ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తదితరులు ఈనెల 15న ఢిల్లీలో జేడీయూ ప్రధాన కార్యదర్శి కేసీ త్యాగి ఇంట్లో సమావేశమై మార్గదర్శకాలపై చర్చించినట్లు తెలిసింది. జార్ఖండ్ మాజీ సీఎం, జేవీఎంపీ చీఫ్ బాబూలాల్ మరాండితో నితీశ్ నేరుగా చర్చలు జరుపుతున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. మరో పక్క అజిత్‌సింగ్,త్యాగీలు ఎస్‌జేపీ(ఆర్) అధినేత కమల్ మొరార్కతో విలీనంపై చర్చించారు. త్వరలోనే ఈ 4 పార్టీలు విలీనం కానున్నాయని, చర్చలు ప్రస్తుతం తుది దశలో ఉన్నాయని విలీన ప్రక్రియను చూస్తున్న నాయకులు తెలిపారు. విలీన తేదీని ఖరారు చేయనప్పటికీ ఈ నెలాఖరుకల్లా కొత్త పార్టీ ఆవిర్భావం ఖాయమంటున్నారు.
ఉత్తరాదిన మరో కొత్త పార్టీ!
Published Mon, Mar 21 2016 12:45 AM | Last Updated on Sun, Sep 3 2017 8:12 PM
Advertisement