న్యూఢిల్లీ: బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయొద్దని ‘స్వచ్ఛభారత్’లో పిలుపునిచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ మాటల్ని దేశ ప్రజానీకం పట్టించుకోలేదు. ముఖ్యంగా పొగాకు ఉత్పత్తులు, పాన్ మసాలా నమిలి ఎక్కడపడితే అక్కడ ఉమ్మడం చాలామందికి అలవాటుగా మారిపోయింది. ఆదివారం మన్ కీ బాత్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ ఈ దురలవాటుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మడం కరోనా వ్యాప్తిని ఎక్కువ చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. మహమ్మారి కరోనా కట్టడికి ఈ ‘అలవాటు’ను మానుకోవాలని ప్రధాని మోదీ మరోసారి పిలుపునిచ్చారు.
‘బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం సరైన పద్ధతి కాదని మనందరికీ తెలుసు. చాలా చోట్ల ఇది ఇప్పటికీ కొనసాగుతోంది. దానిని నిర్మూలించేందుకు ఈ వైరస్ క్లిష్ట సమయమే సరైన సమయం’ అని ప్రధాని పేర్కొన్నారు. ఆ దురలవాటును దూరం చేసుకుంటే పరిశుభ్రతను పెంచడంతోపాటు, కోవిడ్‌తో పోరుకు బలం సమకూరుతుందని అన్నారు. లేకపోతే ప్రజల జీవితాలను ప్రమాదంలో పడేసినట్టేనని ఆయన హెచ్చరించారు. కోవిడ్ పోరులో ప్రజలు సహకారం బాగుందని ప్రధాని ఈ సందర్భంగా ఆనందం వ్యక్తం చేశారు.
(చదవండి: 'కరోనాపై సైనికుల్లా యుద్దం చేస్తున్నారు')
కాగా, కోవిడ్ బాధితులు దగ్గినపుడు, తుమ్మినపుడు వెలువడే తుంపర్ల ద్వారా వైరస్ వ్యాప్తి జరగుతుందనే విషయం తెలిసిందే. ఇక బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు ఉమ్మివేయకుండా.. నిషేదం విధించాలని కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. దాంతోపాటు పాన్ గుట్కా అమ్మకాలను నిషేధించింది. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) కూడా బహిరంగంగా ఉమ్మే అలవాటును మానుకోవాలని సూచించింది. ఇక ఒడిశా, తెలంగాణ రాష్ట్రాలు, ముంబై నగర పాలక సంస్థ బహిరంగంగా ఉమ్మితే నేరంగా పరిగణిస్తామని ఆదేశాలు జారీ చేశాయి.
కాగా, గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1990 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో.. మొత్తం కేసుల సంఖ్య 26,496కు చేరింది. ఒక రోజు ఇంత స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే ప్రథమం. ఇప్పటివరకు వైరస్ బారినపడి 824 మంది ప్రాణాలు కోల్పోయారు.
(చదవండి: వధూవరులకు కరోనా, గ్రామానికి సీల్)
Comments
Please login to add a commentAdd a comment