
ఇక ఫేస్ బుక్ లోనే డాక్టర్!
న్యూఢిల్లీ: ఇకపై డాక్టర్ ను సంప్రదించాలంటే గంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు. ఫోన్ కాల్స్ వృధా చేసుకోవాల్సిన పని కూడా లేదు. ఫేస్ బుక్ మెసెంజర్ లో ఒక్క మెసేజ్ పెడితే చాలు. ఆన్ లైన్లోనే ఆరోగ్య సమస్యపై డాక్టర్ల సలహాలు తీసుకోవచ్చు. భారత్ లో ఈ సదవకాశాన్ని కొత్తగా సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ అందుబాటులోకి తీసుకొస్తున్నది. ఆన్ లైన్లో డాక్టర్లను సంప్రదించే ఈ ప్రత్యేక అవకాశాన్ని లైబ్రేట్స్.. మొదటిసారి లైబ్రేట్ బాట్ పేరిట రానుంది.
ఫేస్ బుక్ లైబ్రేట్ బాట్ అనేది మెసెంజర్ ఛాట్ లిస్టులో మాములూ కాంటాక్ట్ లాగే కనిపిస్తుంది. ఆరోగ్య సమస్యలను, అనుమానాలను డాక్టర్లను అడిగి నివృత్తి చేసుకునేందుకు ఈ బాట్ చక్కగా సహకరిస్తుంది. అయితే ఇందులో వినియోగదారులు అడిగిన విషయాలనుబట్టి సమాధానం వచ్చేందుకు సమయం పడుతుంది. ఈ బాట్ ను యూజర్లు తమ తమ మెసెంజెర్ ఖాతాలో ఉచితంగానే యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసిన తర్వాత http://m.me/lybrate లింక్ పై క్లిక్ చేస్తే సరిపోతుంది.
లైబ్రేట్ బాట్ మెసెంజర్ లో హెల్త్ క్విజ్ కూడా ఉంటుంది. దీనిద్వారా ప్రజలు పెద్దగా పట్టించుకోని, అనేక రకాల సాధారణ ఆరోగ్య సమస్యలపై అవగాహన పెంచుకునే అవకాశం ఉంటుంది. అంతేకాక లైబ్రేట్ మొబైల్ యాప్ రూపంలోనూ అందుబాటులోకి వస్తోంది. దీనిద్వారా 50 మంది స్పెషలిస్టులతో సహా సుమారు లక్షమంది వరకూ డాక్టర్లు దేశవ్యాప్తంగా వినియోగదారులకు అందుబాటులో ఉంటారు.