
శునక వధతో 'గోల్డెన్' ఛాన్స్!
తిరువనంతపురం: 'వీధి కుక్కలను చంపండి బంగారు నాణేలు పట్టుకెళ్లండి' అంటూ కేరళలో పూర్వ విద్యార్థి సంఘం చేసిన ప్రకటన అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. డిసెంబర్ 10లోపు ఎక్కువ కుక్కలను చంపిన వారికి గోల్డ్ కాయిన్స్ ఇస్తామని పాలా ప్రాంతానికి చెందిన సెయింట్ థామస్ కాలేజీ పూర్వ విద్యార్థుల సంక్షేమ సంఘం ప్రకటించింది.
కేరళలో వీధి కుక్కలు పెద్ద సమస్యగా మారాయి. గత నాలుగు నెలల్లో వీధి కుక్కల దాడిలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, 700 మంది వరకు గాయాలపాలయ్యారు. అక్టోబర్ 26న 90 ఏళ్ల వృద్ధుడిని కుక్కలు పీక్కుతినడం సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో వీధి కుక్కలను వధించే వారిని ప్రోత్సహించేందుకు విద్యార్థుల సంఘం.. బంగారు నాణేలు ఇస్తామని ఆఫర్ ప్రకటించింది. ఎక్కువ కుక్కలను చంపించిన పంచాయతీ ప్రెసిడెంట్, మున్సిపల్ చైర్మన్లకు గోల్డ్ కాయిన్స్ అందజేస్తామని విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శి జేమ్స్ పాంబేక్కాల్ తెలిపారు. శునకాల దాడుల నుంచి ప్రజలను కాపాడడమే తమ లక్ష్యమని చెప్పారు.
స్వైరవిహారం చేస్తున్న శునకాలను అడ్డుకునేందుకు అవసరమైన ఎయిర్ గన్స్ ను తక్కువ ధరకు ఇస్తామని ఇంతకుముందు ప్రకటించి ఈ సంఘం వార్తల్లో నిలిచింది. కుక్కలను చంపిన వారికి నగదు నజరానా ఇచ్చేందుకు పారిశ్రామికవేత్త ఒకరు ముందుకు వచ్చారు.