పౌష్టికాహార సిబ్బంది రోడ్డెక్కారు
సాక్షి, చెన్నై: ప్రభుత్వ హెచ్చరికలను బేఖాతరు చేసి మరీ పౌష్టికాహార సిబ్బంది తమ డిమాండ్ల సాధనకు రోడ్డెక్కారు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల ముట్టడికి యత్నించారు. ఓ వైపు నిరసనకు దిగినా, మరో వైపు విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా మధ్యాహ్న భోజనం సిద్ధంచేసి పెట్టడం విశేషం.
రాష్ట్రంలో 68వేల పౌష్టికాహార కేం ద్రాలు, 35వేల అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో రెండు లక్షల యాభై వేల మంది సిబ్బంది పని చేస్తున్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం అమలు, అంగన్ వాడీ కేంద్రాల్లో పిల్లల ఆలనా పాలన, విద్యాబుద్ధులు చూడటం ఈ సిబ్బంది దిన చర్య. పౌష్టికాహార పథకం అమల్లో ఇటీవల మెనూ మార్చే పనిలో రాష్ట్ర ప్రభుత్వం పడింది. దీంతో సిబ్బందికి అదనపు భారం తప్పలేదు. అలాగే, ఉన్న ఖాళీల రూపంలో మరింత భారాన్ని ఎదుర్కొంటున్నారు. చాలీ చాలని జీతాలతో నెట్టుకొస్తున్న ఈ సిబ్బంది పలు మార్లు ప్రభుత్వం దృష్టికి తమ విజ్ఞప్తులను తీసుకెళ్లినా ఫలితం శూన్యం. చివరకు పౌష్టికాహార, అంగన్ వాడీ ఉద్యోగ, సిబ్బంది సంఘాల సమాఖ్య ఏర్పాటు చేసుకున్నారు.
ప్రభుత్వంపై ఒత్తిడికి లక్ష్యంగా నిరసనలకు సిద్ధమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు వీరు ఇచ్చిన పిలుపుతో ప్రభుత్వం మేల్కొంది. ఎక్కడ పౌష్టికాహార పథకం అమలుకు అడ్డంకులు బయలు దేరుతాయోనన్న ఆందోళనలో పడింది. వీరి ఆందోళనకు బ్రేక్ వేయించడం లక్ష్యంగా హెచ్చరికలను జారీ చేసింది. ఆందోళనలో పాల్గొంటే, చర్యలు తప్పవని హెచ్చరించింది. అయితే, ఈ సమాఖ్య ఉద్యోగ, సిబ్బంది ఆ హెచ్చరికలను ఖాతరు చేయలేదు. తమ డిమాండ్ల సాధనే లక్ష్యంగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు దిగారు.
ముట్టడి యత్నం: పౌష్టికాహారం, అంగన్‌వాడీ కేంద్రాల్లోని 40 వేల ఖాళీ పోస్టుల భర్తీ, పౌష్టికాహారం పథకం అమలుకు ప్రత్యేక శాాఖ, వేతనాల పెంపు, పని భారం తగ్గింపు, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పదోన్నతులు, తదితర డిమాండ్లతో ఉదయం పదిన్నర గంటలకు అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు చేపట్టారు. ర్యాలీల రూపంలో మహిళలు కదంతొక్కారు. జిల్లాల కలెక్టరేట్ల ముట్టడికి యత్నించారు. అయితే, మార్గం మధ్యలోనే వీరిని అనేక చోట్ల పోలీసులు అడ్డుకున్నారు. మహిళా పోలీసుల సాయంతో బలవంతంగా అరెస్టు చేశారు. కొన్ని చోట్ల మహిళా పోలీసుల సంఖ్య కంటే, నిరసనలో పాల్గొన్న మహిళల సంఖ్య అధికంగా ఉండడంతో ఇరకాటం తప్పలేదు.
చెన్నైలో ఆ సమాఖ్య అధ్యక్షురాలు తమిళరసి నేతృత్వంలో జిల్లా కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. పోలీసులు వీరిని అడ్డుకోవడంతో రాజాజీ సాలైలో బైఠాయించారు. దీంతో ఆ మార్గంలో వాహనాలు ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కాయి. పలుమార్లు ఆందోళనకారులను పోలీసులు బుజ్జగించారు. అయితే, నిరసనకారులు ఖాతరు చేయలేదు. చివరకు వారందరినీ అరెస్టు చేసి, సమీపంలోని ఓ కల్యాణ మండపానికి తరలించారు. ఈ సందర్భంగా ఆ సమాఖ్య కన్వీనర్లు, జాయింట్ కన్వీనర్లు పళని కుమార్, వరదరాజన్ మీడియాతో మాట్లాడుతూ, తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం లక్ష్యంగా చేపట్టిన నిరసనకు రాష్ట్ర వ్యాప్తంగా స్పందన వచ్చిందన్నారు. ప్రభుత్వ హెచ్చరికలను పక్కన పెట్టి సుమారు 50 వేల మంది సిబ్బంది కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాల్లో పాల్గొన్నారని పేర్కొన్నారు.
సజావుగానే పథకం: సిబ్బంది నిరసన బాట పట్టినా, పౌష్టికాహార పథకానికి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. ఆయా ప్రాంతాల్లో , కేంద్రాల నుంచి కొంత మంది సిబ్బంది నిరసనకు వెళ్లినా, మరి కొందరు పథకం ఆగకుండా, విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా విధులు నిర్వర్తించారు. దీంతో విద్యార్థులకు పౌష్టికాహారం సజావుగానే అందింది. ఇదే విషయమై వరదరాజన్ పేర్కొంటూ, తమ సిబ్బంది నిరసనకు వచ్చినా, విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని వ్యాఖ్యానించడం విశేషం. ఇక, తమ హెచ్చరికలను బేఖాతరు చేసి, నిరసనకు వెళ్లిన వారి భరతం పట్టేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. విధులకు ఎవరెవరు ైగె ర్హాజరు అయ్యారో వారి వివరాల్ని జిల్లా అధికారులు సేకరించేందుకు రెడీ అవుతుండడం గమనార్హం.