బరాక్ ఒబామా.. చ్యూయింగ్ గమ్
ఒకవైపు సైనిక దళాలు తమ పాటవాన్ని ప్రదర్శిస్తున్నాయి. మరోవైపు హెలికాప్టర్ల నుంచి పూలవర్షం కురుస్తోంది. అయితే.. ముఖ్యఅతిథిగా హాజరైన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మాత్రం.. వేడుకలు చూస్తూ చ్యూయింగ్ గమ్ నములుతూ కనిపించారు. మధ్యమధ్యలో దాన్ని బయటకు తీసి, మళ్లీ నోట్లోకి పెట్టుకుంటూ ఫొటోలకు దొరికేశారు. రంగురంగుల తలపాగా ధరించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ పక్కనే నల్లటి సూటులో వచ్చిన ఒబామా కూర్చున్నారు.
ఇంతకుముందు బీజింగ్లో జరిగిన ఆసియా పసిఫిక్ ఆర్థిక సమితి (అపెక్) సమావేశాల సమయంలో కూడా ఒబామా ఇదే తరహాలో చ్యూయింగ్ గమ్ నములుతూ కనిపించడంతో సోషల్ మీడియాలో పెద్ద వివాదమే రేగింది. ఆ సదస్సులో పలు సందర్భాల్లో అమెరికా అధ్యక్షుడు చ్యూయింగ్ గమ్ నములుతూ, తీస్తూ కనిపించారని, సదస్సుకు వచ్చేటప్పుడు కూడా అలాగే చేశారని ఇంగ్లండ్ పత్రిక 'ద ఇండిపెండెంట్' అప్పట్లో విమర్శించింది.