
భువనేశ్వర్ : రాష్ట్ర ప్రజల సమగ్ర సంక్షేమం పట్ల ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా విధించిన లాక్‌డౌన్‌తో ప్రజలందరూ 24 గంటల పాటు ఇంటికే పరిమితమవుతున్న నేపథ్యంలో ఇంట్లో ఆడవాళ్లపై భారం మోపరాదని, మగాళ్లు ఇంటి పనుల్లో వారికి సహాయం చేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ ప్రధానంగా వంటావార్పు సన్నాహాలతో మహిళల్ని ఉక్కిరిబిక్కిరి చేయోద్దు. విందు వినోదాలకు ఇది సమయం కాదు. ఇంటిల్లి పాది కలిసిమెలిసి బతకాల్సిన సమయం. ఇంటి పనుల్లో ఆడవాళ్లకు మగాళ్లు చేదోడు వాదోడుగా ఉండాలి.
గృహ నిర్బంధాన్ని పురష్కరించుకుని ఇంట్లో మగాళ్లు తీరిగ్గా కూర్చోవటం, మహిళలు రోజుకు 3-4సార్లు రుచికరమైన వంటకాలు చేస్తూ వంటింట్లో నలిగిపోవటం కాదు. వేసవి తాపం పెరుగుతోంది. మహిళలను వంటింటికి పరిమితం చేస్తే కుంగిపోతారు. వారితో పాటు దేశం కూడా కుంగిపోతుంది. మగాళ్లు ఓపికతో మసలుకోవాలి. ఆహారం వేళల్ని నియంత్రించుకోవాలి. ఇల్లాలి వెతల్ని పంచుకుని వంటావార్పు వ్యవహారాల్లో పాలుపంచుకుని మగాళ్లు మమకారం చాటుకోవాల’ని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment