
మహాకూటమిలో చేరికపై నవీన్ పట్నాయక్ స్పందన ఇలా..
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికలకు ముందు విపక్ష పార్టీలతో కూడిన మహాకూటమిలో చేరికపై తనకు మరికొంత సమయం కావాలని బీజేడీ నేత, ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ పేర్కొన్నారు. మహాకూటమిలో చేరికకు సంబంధించి తాము ఆలోచించి ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు. క్వింటాల్ ధాన్యానికి మద్దతు ధరను రూ 2930కు పెంచాలనే డిమాండ్‌తో బీజేడీ ఆధ్వర్యంలో మంగళవారం దేశ రాజధానిలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పట్నాయక్ మాట్లాడుతూ మోదీ సర్కార్‌పై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు.
మద్దతు ధర కల్పించడం కేంద్ర ప్రభుత్వ బాధ్యతని, దీని నుంచి కేంద్రం తప్పించుకోలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి తాము పలుసార్లు మద్దతు ధరపై విన్నవించినా పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. బీజేపీ, కాంగ్రెస్‌లకు ఇప్పటివరకూ సమదూరం పాటిస్తున్న బీజేడీ మోదీ సర్కార్‌పై విమర్శలతో విరుచుకుపడటం గమనార్హం. గత నాలుగున్నరేళ్లుగా ఒడిషా ప్రభుత్వం వ్యవసాయంపై రూ 30,000 కోట్లు వెచ్చించిందన్నారు.