పుణె : దేశం కోసం ఏదో చేయాలనే ఆశ, ఆకాంక్ష. సైన్యంలో చేరి తన వంతుగా భరతమాతకు సేవ చేయాలనే బలమైన కోరిక. మరోపక్క పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న కుటుంబ పోషణ కోసం సంపాదించాల్సిన పరిస్థితి. అయినా పట్టు వదల్లేదు. తన సంకల్పాన్ని వీడలేదు. కుటుంబం కోసం రాత్రుళ్లు క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తూ పగటి సమయంలో చదువు కొనసాగించాడు అతను. లక్ష్యాన్ని చేరుకునే మార్గాన్ని చూపుతూ.. అనుకోకుండా ఒక రాత్రి తన క్యాబ్‌లో ప్రయాణిస్తున్న ఒక ఆర్మీ ఆఫీసర్ పరిచయమయ్యారు.
ఆయనే సర్వీస్ సెలెక్షన్ బోర్డు(ఎస్‌ఎస్‌బీ) పరీక్ష గురించి, చెన్నైలో ఉన్న ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ గురించి ఆ 26 ఏళ్ల యువకుడితో చెప్పాడు. రెట్టించిన ఉత్సాహంతో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలనే బలమైన కోరికతో కష్టపడిన ‘ఓం పైథానే’ తొలి ప్రయత్నంలోనే ఎస్‌ఎస్‌బీ పరీక్షలో విజయం సాధించాడు. గురువు లెఫ్టినెంట్ కల్నల్ బాలు చూపిన బాటలో నడిచిన పైథానే లెఫ్టినెంట్ కల్నల్‌గా ఎంపికయ్యాడు.
యువ ఆఫీసర్‌తో కోచ్..
‘ఓం 18 నెలల క్రితం తన వద్దకు వచ్చాడు. ఇండియన్ ఆర్మీలో చేరేందుకు అవసరమైన ఆసక్తి, పట్టుదల, సామర్థ్యం అతనిలో ఉన్నాయి. వాటి ఫలితమే తొలి ప్రయత్నంలోనే విజయం’ అని కోచ్ బాలు హర్షం వ్యక్తం చేశారు. ఓం నేపథ్యం పుణెలోని గ్రామీణ ప్రాంతం కావడంతో భాష విషయంలో మొదట ఇబ్బందిపడ్డాడు. కానీ కష్టపడి ప్రయత్నించి దాన్ని అధిగమించాడని తన విద్యార్థి గురించి కోచ్ బాలు చెప్పుకొచ్చారు. పైథానేను సన్మానించి యువతలో స్ఫూర్తి నింపారు. దేశానికి సేవ చేసేందుకు సైన్యంలో చేరాలనుకునే యువతనుద్ధేశించి యువ ఆఫీసర్ మాట్లాడుతూ... మనపై మనకు పూర్తి నమ్మకం, ఆత్మ విశ్వాసం ఉండాలన్నారు. చేసే వృత్తి ఏదైనా మనసు పెట్టి పని చేయాలని సూచించారు. అప్పుడే 100 శాతం సఫలం అవుతామని చెప్పారు.
ఉపాధి చూపిన మిత్రుడు..
‘దేశం కోసం శ్రమించాలని, ఏదైనా సాధించాలని ఓం తరచూ చెప్పేవాడు. కానీ అతన్ని పేదరికం ఎంతగానో కుంగదీసింది. కుటుంబం గడవడానికి ఓం పనిచేయాల్సిన పరిస్థితి. అందుకే నేను కొనుగోలు చేసిన క్యాబ్‌కి డ్రైవర్‌గా అతను రాత్రుళ్లు పనిచేసేవాడ’ని ఓం చిన్ననాటి మిత్రుడు రాహుల్ భాలేరావ్ చెప్పారు. ఏడాది పాటు చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో ఎంతో కఠినమైన శిక్షణను పూర్తి చేసుకున్న పైథానే మరికొన్ని రోజుల్లో లెఫ్టినెంట్ కల్నల్‌గా బాధ్యతలు తీసుకోనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment