హిజ్బుల్ ముజాహిద్దీన్ అనే ఉగ్ర సంస్థలో చేరాడని భావిస్తున్న మీర్ ఇద్రీస్ సుల్తాన్
కశ్మీర్ : భారత ఆర్మీకి చెందిన ఓ జవాను గత శనివారం నుంచి అదృశ్యమయ్యాడని, బహుశా హిజ్బుల్ ముజాహిద్దీన్ అనే ఉగ్రవాద సంస్థలో చేరి ఉండవచ్చునని పోలీసులు తెలిపారు. అదృశ్యమైన జవాను, ఉగ్రవాద సంస్థలో చేరినట్లు తెలియజేసేలా ఏకే- 47 పట్టుకుని ఉన్న ఫోటోను హిజ్బుల్ విడుదల చేసింది. ఈ ఫోటో స్థానిక మీడియాలో వైరల్ అవుతోంది. ఉగ్రవాద సంస్థలో చేరినట్లు భావిస్తున్న సిపాయి మీర్ ఇద్రీస్ సుల్తాన్, 12వ జమ్మూ కశ్మీర్ లైట్ ఇన్ఫాంట్రీకి చెందినవాడు. దక్షిణ కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలోని అతని స్వగ్రామానికి చివరిసారిగా ఈ నెల 12న వచ్చినట్లు తెల్సింది. ఏప్రిల్ 14 నుంచి అదృశ్యమయ్యాడు.
ఈ విషయం గురించి మీర్ ఇద్రీస్ సుల్తాన్ తండ్రి స్థానిక పోలీసులను సోమవారం ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. మరో ఇద్దరు యువకులతో ఉగ్రవాద సంస్థలో మీర్ సుల్తాన్ చేరినట్లు మీడియాకు పోలీసులు వివరించారు. ఈ విషయాన్ని పోలీసులు కూడా భారత ఆర్మీకి తెలిపారు. ఉగ్ర సంస్థలో చేరిన సుల్తాన్ ఫోన్ రికార్డులు పరిశీలిస్తున్నామని, అలాగే ఉగ్ర సంస్థలతో సుల్తాన్ సంబంధాలపై విచారణ జరుపుతున్నామని వెల్లడించారు. అతను ఉగ్రవాద సంస్థలో చేరినట్లు తమ వద్ద ఎటువంటి ఆధారాలు ప్రస్తుతం తమ వద్ద లేవని, అతను సెలవులో ఉన్నపుడు కశ్మీర్‌కు వెళ్లాడా లేదా అనే సమాచారం కూడా తమ వద్ద లేదని భారత ఆర్మీ పేర్కొంది.
ప్రస్తుతం బిహార్‌లోని కటిహర్‌లో మీర్ ఇడ్రీస్ సుల్తాన్ పనిచేస్తున్నాడు. జార్ఖండ్‌కు బదిలీపై వెళ్లాల్సి ఉంది. అయితే అక్కడకు వెళ్లేందుకు ఇష్టపడటంలేదని తెలిపింది. ఆ కారణంతోనే హిజ్బుల్‌లో చేరి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హిజ్బుల్ ముజాహిద్దీన్ విడుదల చేసిన చిత్రంలో సుల్తాన్, ఏకే-47 పట్టుకున్నట్లు, అతని వివరాలు గ్రీన్ అక్షరాలలో దానిపై కనపడేటట్లు ఉంది. అలాగే బీఎస్సీ రెండో సంవత్సరం చదివినట్లు ఆ ఫోటో మీద రాసి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment