‘అందరూ కలిసి యోగా చేయడం హానికరం’
న్యూఢిల్లీ: ఆయన 40 ఏళ్లుగా యోగా చేస్తున్నారు. పైగా నిపుణుల సలహా,శిక్షణ తీసుకొని మరి ఆ ప్రాక్టీస్‌ను కొనసాగిస్తున్నారు. కానీ, అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు(జూన్ 21)న మాత్రం యోగా మానేశారు. పొద్దున్నే కూర్చుని నెట్టింట్లో అడుగుపెట్టి ట్విట్టర్‌లోకి వెళ్లారు. ప్రధాని నరేంద్రమోదీ, యోగా గురువు రాందేవ్ బాబా యోగాలో నిమగ్నమై ఆసనాలు వేస్తుండగా ఆయన మాత్రం వారిపై సెటైర్లు వేయడం, ఆగ్రహం వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. వారి యోగా విధానాన్ని విమర్శిస్తూ ట్వీట్ల వర్షం కురిపించారు.
ఆయన ఎవరో కాదు.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్. అందరినీ ఒకే చోట చేర్చి పెద్ద మొత్తంలో యోగా చేయించవల్ల మంచికంటే చెడే ఎక్కువగా జరుగుతుందని అన్నారు. ప్రధాని మోదీ, రాందేవ్ బాబా అలా భారీ స్థాయిలో యోగా నిర్వహించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. అందుకే తాను భారీ యోగా క్యాంపులను వ్యతిరేకిస్తున్నానని అన్నారు. తాను 40 ఏళ్లుగా యోగా చేస్తున్నానన్న ఆయన అది ప్రత్యేక నిపుణుల సలహాల ద్వారా మాత్రమే చేయాలని అన్నారు.
‘మోదీ చేస్తున్న భారీ యోగా కాంపుల వెనుక అసలు ఉద్దేశం అర్ధం కావడం లేదా? మోదీ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి నాటకాలు చేస్తుంటారు’ అని విమర్శించారు. యోగా అనేది వ్యక్తిగతంగా, ప్రత్యేక ప్రాంతంలో నిపుణుల సలహాతో మాత్రమే చేయాలిగానీ, అలా అందరూ ఒక చోట చేయడం హాని కలిగిస్తుందని చెప్పారు.