రైల్వే ఫ్లెక్సీ–ఫేర్‌కి మరోసారి మార్పులు
న్యూఢిల్లీ: డిమాండ్‌కు అనుగుణంగా చార్జీలు (ఫ్లెక్సీ–ఫేర్) విధానంలో మరోసారి మార్పులు తీసుకురావాలని రైల్వే శాఖ యోచిస్తోంది. ఈ విధానంలో అందుబాటులో ఉన్న సీట్లు చాలా మిగులుతుండటంతో సవరణలు చేయాల్సిందిగా రైల్వే మంత్రి ఆదేశించినట్లు తెలిసింది. ఈ విధానం ప్రకారం రాజధాని, శతాబ్ది, దురంతో రైళ్లలో 10 శాతం బెర్తులను ప్రామాణిక ధరలకు కేటాయిస్తారు.
ఆ తర్వాత ప్రతి 10 శాతం సీట్లు నిండే కొద్దీ చార్జీ మరో 10 శాతం పెరిగిపోతుంటుంది. ప్రయాణికుల నుంచి స్పందన లేకపోవడంతో గతేడాది డిసెంబరులో రైల్వే శాఖ ఈ విధానానికి తొలిసారి సవరణ చేసి, రిజర్వేషన్ చార్ట్ తయారైన తర్వాత మిగిలిపోయిన బెర్తులను 10 శాతం తక్కువ ధరకే అమ్ముతోంది. ఇక నుంచి 50 శాతం సీట్లను ప్రామాణిక ధరలకు అమ్మాలని చూస్తున్నారు.