
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆయుష్మాన్ భారత్ (మోదీ కేర్) పథకం ద్వారా 10,000 కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని అధికారులు పేర్కొన్నారు. మోదీ కేర్‌తో దేశవ్యాప్తంగా పది కోట్ల పేద కుటుంబాలకు రూ 5 లక్షల ఆరోగ్య బీమా కల్పించనున్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద వైద్య సేవలు పొందేందుకు ఆస్పత్రులకు వచ్చే రోగులకు సహకరించేందుకు దాదాపు లక్ష మంది ఆయుష్మాన్ మిత్రలను ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రుల్లో నియోగించనున్నారు.
వీరి నియామకానికి సంబంధించి ఆరోగ్య మంత్రిత్వ శాఖ నైపుణ్యాభివృద్ధి శాఖతో ఒప్పందంపై సంతకాలు చేసింది. రోగులకు సహకరిస్తూ ఆస్పత్రికి, లబ్ధిదారుల మధ్య సమన్వయకర్తలుగా వ్యవహరిచించేందుకు ఈ పథకం కింద ఎంపికైన ప్రతి ఆస్పత్రిలో ఓ ఆయుష్మాన్ మిత్ర అందుబాటులో ఉంటారని, వారు హెల్ప్ డెస్క్‌ను నిర్వహిస్తారని అధికారులు చెప్పారు.
ఈ కార్యక్రమం కింద ఇప్పటికే 20,000 ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రులు ఎంపికయ్యాయని తెలిపారు. ఈ పథకం కింద లబ్ధిదారులను సామాజికార్థిక కుల గణన సర్వే ఆధారంగా ఎంపిక చేస్తారు. లబ్ధిదారులందరికీ క్యూఆర్ కోడ్స్‌తో కూడిన లేఖను అందచేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment