రికార్డు స్థాయికి ఉల్లి ధర
లాసల్‌గావ్‌లో క్వింటాలు రూ. 4,900
ఢిల్లీలో కిలో ధర రూ. 80
న్యూఢిల్లీ: దేశంలోని అతి పెద్ద హోల్‌సేల్ మార్కెట్ అయిన నాసిక్(మహారాష్ట్ర)లోని లాసల్‌గావ్‌లో ఉల్లి ధర రికార్డు స్థాయికి చేరుకుంది. గురువారం అక్కడ క్వింటాలు ఉల్లి ధర రూ.4,900 పలికింది. జాతీయ ఉద్యానవన పరిశోధన, అభివృద్ధి ఫౌండేషన్(ఎన్‌హెచ్‌ఆర్‌డీఎఫ్) లెక్కలను అనుసరించి.. లాసల్‌గావ్ మార్కెట్‌లో క్వింటాలు ధర నిన్నటి వరకు రూ.4,500 పలుకుతుండగా.. గురువారం ఒక్కరోజే క్వింటాలుకు రూ.400 మేరకు అమాంతం పెరిగిపోయింది. గడిచిన రెండేళ్లలో లాసల్‌గావ్ మార్కెట్‌లో ఉల్లిపాయలకు పలికిన అత్యధిక ధర ఇదే. ఢిల్లీలో కిలో ధర రూ.80కి చేరింది. కొత్త పంట ఇంకా రాక సరఫరా తగ్గిపోవడమే ధరల మోతకు ప్రధాన కారణమని ఎన్‌హెచ్‌ఆర్‌డీఎఫ్ డెరైక్టర్ ఆర్‌పీ గుప్తా విశ్లేషించారు.
ధరల మోతకు కారణాలు..
♦ గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో కొత్త పంట రావడం మరింత జాప్యం కానుండడం.
♦ వర్షాభావ పరిస్థితుల కారణంగా మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలో ఖరీఫ్ ఉల్లి ఉత్పత్తి భారీగా తగ్గే అవకాశం ఉంది.
♦ 2014-15 పంట సంవత్సరం(జూలై-జూన్)లో ఉల్లి దిగుబడులు 189 లక్షల టన్నులుగా అంచనా.
♦ అంతకుముందు ఏడాదిలో దిగుబడుల(194 లక్షల టన్నులు)తో పోలిస్తే ఇది ఐదు లక్షల టన్నులు తక్కువ.