మంచి రోజులంటే ఇవేనా?
ధరలు, రైల్వే బడ్జెట్‌పై పార్లమెంటులో విపక్షాల ధ్వజం
దద్దరిల్లిన ఉభయ సభలు
నియంత్రిస్తామన్న ప్రభుత్వం
న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో బుధవారం కూడా అధిక ధరలు, రైల్వే బడ్జెట్ తదితర అంశాలపై విపక్షాలు ప్రభుత్వంపై దాడి చేశాయి. ఇవి మంచిరోజుల రాకకు చిహ్నమా అంటూ బీజేపీ ఎన్నికల నినాదాన్ని ఎద్దేవా చేశాయి. పలుసార్లు సభలను అడ్డుకున్నాయి. లోక్‌సభ, రాజ్యసభల్లో ధరల పెరుగుదల, వర్షాభావం చర్చలో కాంగ్రెస్, సమాజ్‌వాదీ, తృణమూల్ కాంగ్రెస్ తదితర విపక్షాలు ప్రభుత్వాన్ని దుయ్యబట్టాయి. దీనికి స్పందించిన ప్రభుత్వం.. భయపడాల్సిన అవసరం లేదని, ధరలను కట్టడి చేస్తామని హామీ ఇచ్చింది. లోక్‌సభలో సభ్యుల నిరసన, ప్రవర్తనపై స్పీకర్ సుమిత్రా మహాజన్ తీవ్ర అభ్యంతరం, ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ స్థానాన్ని గౌరవించకపోతే వ్యవహారం మరింత తీవ్రమవుతుందన్నారు.
స్పీకర్ కలత.. లోక్‌సభలో ప్రశ్నోత్తరాలు ప్రారంభం కాగానే రైల్వే బడ్జెట్‌లో తమకు అన్యాయం జరిగిందంటూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు ప్లకార్డులతో వెల్‌లోకి దూసుకెళ్లారు. మంగళవారం ఓ బీజేపీ ఎంపీ తమ మహిళా ఎంపీపై అనుచితంగా ప్రవర్తించారంటూ ప్రధాని మోడీకి, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్లకార్డులపై స్పీకర్ అభ్యంతరం తెలుపుతూ ఎంపీలను హెచ్చరించారు. దీనిపై తృణమూల్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ స్పీకర్‌ను విమర్శించారు. ‘మహాజన్.. మీరు బీజేపీ స్పీకర్ కారు, నరేంద్ర మోడీ స్పీకర్ కారు’ అన్నారు. దీనికి బీజేపీ ఎంపీలందరూ లేచి నిరసన తెలిపారు. బెనర్జీ వ్యాఖ్యలకు స్పీకర్ కలతచెందారు. మంగళవారం నుంచి కొందరు సభ్యుల ప్రవర్తన అనుచితంగా ఉందని, ఇది దురదృష్టకమని అన్నారు. దుర్భాషలు, నినాదాలు, ప్లకార్డులతో అంతరాయాల వల్ల అందరం బాధపడతున్నామని, ఇది పార్లమెంటు గౌరవానికి తగినది కాదన్నారు. స్వీయ క్రమశిక్షణే ప్రజాస్వామ్య సారాంశమన్నారు. గందరగోళం మధ్య సభ మధ్యాహ్నానికి వాయిదాపడింది. సభ తిరిగి మొదలయ్యాక బెనర్జీ స్పీకర్‌కు క్షమాపణ చెప్పారు. తనను సభ స్పీకర్‌గా ఎన్నుకుంది కనుక సభకుచెప్పాలని ఆమె సూచించగా బెనర్జీ సభకు క్షమాపణ చెప్పారు. ధరలపై చర్చలో పాల్గొన్న కాంగ్రెస్ నేత అమరీందర్.. బీజేపీ ప్రభుత్వం హామీ ఇచ్చిన మంచిరోజలు ఎక్కడ అని ప్రశ్నించారు.
రాజ్యసభలో.. ఎగువ సభలోనూ ప్రశ్నోత్తరాల సమయంలో తృణమూల్, కాంగ్రెస్ ఎంపీలు రైల్వే బడ్జెట్‌పై నిరసన తెలిపారు. ఇది ముందుగానే లీకైందంటూ ఓ దినపత్రిక క్లిప్పింగ్ ప్రదర్శించి, చర్చకు పట్టుబట్టారు. అయితే దీనిపై కాంగ్రెస్ ఇచ్చిన నోటీ సు సభ చైర్మన్ పరిశీలనలో ఉంది కనుక చర్చకు అనుమతించనని డిప్యూటీ చైర్మన్ కురియన్ చెప్పారు. రభస మధ్య సభ మధ్యాహ్నానికే రెండు సార్లు వాయిదాపడి తిరిగి మొదలైంది. ప్రధాని ఆదేశంపై హోం శాఖలోని చారిత్రకంగా కీలకమైన 1.5 లక్షల ఫైళ్లను ప్రభుత్వం నాశనం చేసిందని, వీటిలో మహాత్మాగాంధీ హత్యకు సంబంధించిన ఫైళ్లు కూడా ఉన్నాయని సీపీఎం ఎంపీ పి.రాజీవ్ ఆరోపించారు. దీనికి ప్రధాని వివరణ ఇవ్వాలన్నారు. న్యాయమంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ ఆరోపణను తోసిపుచ్చారు.
ధరలు, కరువుపై భయమొద్దు: కేంద్రం
అధిక ధరలపై భయపడాల్సిన అవసరం లేదని ఆహార మంత్రి రాం విలాస్ పాశ్వాన్ లోక్‌సభలో చెప్పారు. దేశంలో ధాన్యానికి కొరత లేదని, కొంతమంది వ్యాపారులు ధాన్యాన్ని భారీగా దాస్తున్నారని, ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకుంటోందన్నారు. ఉల్లి, బంగాళాదుంపలు వంటి ధరలు జూన్-సెప్టెంబర్‌లలో సహజంగానే ఎక్కువగా ఉంటాయన్నారు. ధరల నియంత్రణకు ఉల్లి, బంగాళాదుంపలను నిత్యావసరాలకిందికి తెచ్చామన్నారు. రాజ్యసభలో వ్యవసాయ మంత్రి రాధామోహన్‌సింగ్ మాట్లాడుతూ.. వర్షాభావాన్ని ఎదుర్కోవడానికి చర్యలు ప్రారంభించామని, కరువు ప్రాంతాల్లో పంటలకు అదనపు కరెంటును ఇస్తున్నామన్నారు. ప్రభుత్వం దేశంలో ఏ ప్రాంతాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించలేదని, అలా ప్రకటించే అధికారం రాష్ట్రాలదన్నారు. తక్కువ వర్షపాతం నమోదవుతున్న 550 జిల్లాల కోసం అత్యయిక ప్రణాళికను సిద్ధం చేశామన్నారు. కాగా, రైలు చార్జీల పెంపుపై యూపీఏ ప్రభుత్వం వెనక్కి తగ్గిందని, అయితే పెంపు ప్రతిపాదనను అమల్లోకి తెచ్చే ధైర్యం ఎన్డీఏ సర్కారుకుందని రైల్వే మంత్రి సదానంద గౌడ అన్నారు.