పీఎంవోకు తుది నివేదిక అందజేసిన ప్రత్యూష్ సిన్హా కమిటీ
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అఖిల భారత సర్వీసు అధికారుల పంపిణీకి నియమించిన ప్రత్యూష్ సిన్హా కమిటీ కసరత్తు పూర్తయింది. తుది మార్గదర్శకాలతో కూడిన నివేదికను కమిటీ సోమవారం ప్రధానమంత్రి కార్యాలయానికి సమర్పించినట్టు సమాచారం. కమిటీ సభ్యులు సోమవారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు రాజీవ్ శర్మ, ఐవైఆర్ కృష్ణారావులతో సమావేశమయ్యారు. మూడు గంటలపాటు సుదీర్ఘ మంతనాల అనంతరం తుది నివేదికను సిద్ధం చేసినట్టు తెలిసింది. ప్రత్యూష్ సిన్హా అధ్యక్షతన ఢిల్లీలోని నార్త్‌బ్లాక్‌లో మధ్యాహ్నం 12.30 గంటలకు సమావేశం ప్రారంభమైంది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ల పంపిణీకి సంబంధించి తుది నివేదికలో పొందుపర్చాల్సిన మార్గదర్శకాలపై కమిటీ ఇరు రాష్ట్రాల సీఎస్‌ల అభిప్రాయాలు కోరింది.
కోటాకి మించి ఉన్న అధికారులను ఇవ్వడం, రిటైర్‌మెంట్ దగ్గరపడిన అధికారుల్లో ఎన్నేళ్ల వారికి ఆప్షన్లు ఇవ్వాలన్న అంశాలపైనే ప్రధానంగా చర్చ జరిగనట్టు తెలిసింది. రెండేళ్లలోపు రిటైర్‌మెంట్ పొందే వారికి మాత్రమే ఆప్షన్లు ఇస్తే సరిపోతుందని కమిటీ అభిప్రాయపడినట్టు సమచారం. అనంతరం ప్రత్యూష్ సిన్హా కమిటీ తుది నివేదికను ఖరారు చేసింది. దీనిని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ పీఎంవోకు పంపినట్టు తెలిసింది. వారం రోజుల్లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారుల పంపిణీ మార్గదర్శకాలను విడుదల చేయనున్నారు. వాటిపై అధికారుల అభ్యంతరాలు తెలుసుకుని నెలరోజుల్లోగా పంపిణీ ప్రక్రియను పూర్తి చే స్తామని హోంశాఖ వర్గాలు తెలిపాయి.
రెండేళ్ల లోపు రిటైరయ్యే వారికే ఆప్షన్!
Published Tue, Jul 15 2014 12:58 AM | Last Updated on Sat, Jun 2 2018 3:18 PM
Advertisement