మీడియాతో మాట్లాడుతున్న ఒవైసీ
సాక్షి, న్యూఢిల్లీ : ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్‌పై ఎంఐఎం చీఫ్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. రామ మందిర నిర్మాణం జరగకపోతే భారత్ మరో సిరియా అవుతుందని రవిశంకర్ ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో రవిశంకర్ పై కేసు నమోదు చేయాలని ఒవైసీ డిమాండ్ చేస్తున్నారు.
‘రాజ్యాంగంపై ఆయనకు(రవిశంకర్‌ను ఉద్దేశించి) గౌరవం లేదు. అలాంటప్పుడు చట్టాన్ని ఎలా నమ్ముతారు. ఆయనకు ఆయనే చట్టంగా ఫీలయిపోతున్నారు. ఆయన చెప్పిందే అందరూ వినాలని కోరుకుంటున్నారు. ఆయన మధ్యవర్తిలా అనిపించటం లేదు. ప్రజల మధ్య చిచ్చు పెట్టి అల్లర్లకు పురిగొల్పాలని చూస్తున్నారు. ఈ విషయంలో బీజేపీ ఎందుకు స్పందించటం లేదు. వారికి భయమేస్తే చెప్పండి రవిశంకర్‌పై నేనే ఫిర్యాదు చేస్తా. ’ అంటూ మండిపడ్డారు.
ఇక 2019 లోక్‌సభ ఎన్నికల కంటే ముందే వివాదాస్పద స్థల వివాదంలో తీర్పు ఇవ్వాల్సిందిగా ఒవైసీ అత్యున్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.
నా మాటలు వక్రీకరించారు : రవిశంకర్
బరేలీ : రామ మందిర నిర్మాణం చేపట్టకపోతే భారత్ మరో సిరియాగా మారుతుందంటూ ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. దీంతో విమర్శలు వెల్లువెత్తగా ఆయన వివరణ ఇచ్చుకున్నారు.
‘నేను ఇచ్చింది హెచ్చరిక కాదు. ముందస్తుగా జాగ్రత్త సూచన మాత్రమే చేశాను’ అని ఆయన తెలిపారు. పరిష్కారం చూపకపోతే భారత్ లో అలాంటి పరిస్థితులు కనిపిస్తాయన్న కోణంలోనే తాను అలా మాట్లాడానని, ఆ మాటలను కొందరు వక్రీకరిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment