
పద్మ అవార్డుల చోరీ
కన్నడనాట ప్రముఖ కవి, రచయిత, విమర్శకుడిగా పేరొందిన దివంగత కేవీ పుట్టప్ప మెమోరియల్‌లో దోపిడీ జరిగింది.
శివమొగ్గ (కర్ణాటక): కన్నడనాట ప్రముఖ కవి, రచయిత, విమర్శకుడిగా పేరొందిన దివంగత కేవీ పుట్టప్ప మెమోరియల్‌లో దోపిడీ జరిగింది. 'కువెంపు'గా సుప్రసిద్ధుడైన కన్నడ కవి పుట్టప్పకు ప్రభుత్వం ఇచ్చిన పద్మ భూషణ్, పద్మ విభూషణ్ అవార్డులను మెమోరియల్‌లోని గ్లాస్‌కేజ్‌ను బద్దలుకొట్టి దొంగలు దోచుకెళ్లారు. ఈ ఘటన వాచ్‌మన్ భోజన విరామానికి వెళ్లినపుడు సోమవారం రాత్రి 7.30 - 8.30 గంటల మధ్య జరిగింది. చోరీ జరిగిన తీరు మొత్తం సీసీటీవీ రికార్డుల్లో నమోదైంది.
దోపిడీదారులు పద్మ భూషణ్, పద్మ విభూషణ్ మెడళ్లను దోచుకోళ్లారు. కుప్పళ్లిలోని ప్రఖ్యాత కన్నడ కవి దివంగత కేవీ పుట్టప్ప మెమోరియల్‌ను బద్దలుకొట్టి దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. చోరీ జరిగిన తీరు సీసీటీవీ ఫుటేజిలో రికార్డయింది. పుట్టప్ప పూర్వీకుల గృహంలో జరిగిన ఈ ఘటనలో మెడళ్లను దోచుకొని దుండగులు పరారయ్యారని పోలీసులు తెలిపారు.
1967లో జ్ఞానపీఠ్ అవార్డు పొందిన మొదటి కన్నడకవిగా పుట్టప్ప ఖ్యాతిగాంచారు. ఆయన ఇంటిని మెమోరియల్‌గా మార్చారు. 1958లో పద్మభూషణ్, 1988లో పద్మ విభూషణ్ అందుకున్నారు. మొదటి అంతస్తులోని గ్లాస్‌కేజ్‌ను బద్దలుకొట్టి రెండు మెడళ్లను దోచుకెళ్లారని మ్యూజియం అధికారి తెలిపారు. దుండగులు పారిపోవడానికి ముందు సీసీటీవీల్లో రికార్డయిన దృశ్యాలను క్లూస్ టీం పరిశీలిస్తున్నారని, నిందితులను త్వరలోనే పట్టుకొని అరెస్టు చేస్తామని శివమొగ్గ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రవి చన్నవర్ తెలిపారు. ఈ రెండు అవార్డులను మాత్రమే దుండగులు పట్టుకెళ్లారని, మిగిలిన వస్తువులన్నీ భద్రంగానే ఉన్నాయని మ్యూజియం అధికారులు తెలిపారు.