శ్రీనగర్: జమ్మూకశ్మీర్ సరిహద్దులోని లైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్‌ఓసీ) వద్ద పాక్‌స్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. సరిహద్దులోని ఎల్‌ఓసి వద్ద బీఎస్‌ఎఫ్ స్థావరాలపై పాక్ సోమవారం కాల్పులకు దిగింది. కాల్పుల ప్రభావం సరిహద్దులోని రెండు గ్రామాలపై ఉంటుందని, పరిస్థితి సాధారణ స్థితికి వచ్చేంతవరకు ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రావద్దని ఆర్మీ అధికారులు సూచించారు. సరిహద్దులో ఉద్రిక్తత పరిస్థితులు ఉన్నందున కశ్మీర్‌లో పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
పాక్ సరిహద్దులోని ఆర్నియా, ఆర్‌ఎస్ పుర, రాంగఢ్ ప్రాంతాల్లో సోమవారం రాత్రి ఏడుగంటల ప్రాంతంలో పాక్ కాల్పులకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు. పాక్ కాల్పులను భద్రతా బలగాలు తిప్పికొట్టారని, పాక్ పదేపదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నందువల్ల ప్రతీకారం తీర్చుకుంటామని అధికారులు పేర్కొన్నారు. పాక్ దాడులకు ఎల్‌ఓసీ సరిహద్దులోని ఆఖ్కూనూర్‌లో ఎనిమిది నెలల బాలుడు ప్రాణాలు కోల్పోగా, ఆర్నియా సెక్టార్‌లో ఆరుగురు పౌరులు తీవ్రంగా గాయపడ్డారు.
ఆదివారం పాక్ దళాలు కాల్పులకు పాల్పడటంతో వేగంగా స్పందించిన భద్రత దళాలు పాక్ కాల్పులను తిప్పికొట్టన విషయం తెలిసిందే. వెంటనే కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాటిస్తున్నట్లు వెన్నకి తగ్గిన పాక్, సోమవారం మరోసారి రెచ్చిపోయి దాడులకు పాల్పడింది. పాక్ అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఏవిధంగా కాల్పుల విరమణ ఒప్పందానికి పాల్పడిందో 19 సెకన్ల థర్మల్ ఇమేజరీ ఫుటేజ్‌ను బీఎస్‌ఎఫ్ అధికారులు విడుదల చేశారు. కాగా ఏడాది సమయంలో పాక్ ఎల్‌ఓసి వద్ద 700 సార్లు దాడులకు పాల్పడిందని, 38 పౌరులు, 18 మంది భద్రతా సిబ్బంది కాల్పుల్లో మరణించారని ఆర్మీ ఈ అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment