ప్రతీకాత్మక చిత్రం
న్యూఢిల్లీ: ఉత్తర కశ్మీర్‌లోని గందర్‌బల్ ప్రాంతంలోని త్రుంఖల్ అడవుల్లో భారతీయ సైన్యం సెప్టెంబర్ 28 నుంచి ‘ఆపరేషన్ త్రుంఖల్’ కొనసాగిస్తోంది. పాకిస్తానీ ఉగ్రవాదులున్నారన్న సమాచారంతో సెప్టెంబర్ 28న గాలింపు చేపట్టారు. ఆ రోజే ఒక ఉగ్రవాదిని మట్టుపెట్టారు. మరునాడు మరో టెర్రరిస్టును హతమార్చారు. వారి వద్ద నుంచి ఆటోమేటిక్ ఆయుధాలను, ఇతర పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఇంకా ఆ ప్రాంతంలో దాదాపు పాతికమంది శిక్షణ పొందిన సాయుధ ఉగ్రవాదులున్నారనే సమాచారతో నాటి నుంచి ‘ఆపరేషన్ త్రుంఖల్’ను సైన్యం, జమ్మూకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా కొనసాగిస్తున్నారు.
సుశిక్షితులైన పారా కమెండోలను సైతం రంగంలోకి దింపారు. దాంతో ఈ సంవత్సరంలో ఇప్పటివరకు ఎక్కువ రోజులు కొనసాగిన ఆర్మీ ఆపరేషన్‌గా ఇది నిలిచింది. ‘దాదాపు రెండు డజన్ల మంది శిక్షణ పొందిన ఉగ్రవాదులు పాక్ నుంచి గురెజ్ ప్రాంతం ద్వారా కశ్మీర్‌లోకి ప్రవేశించారు. అక్కడి నుంచి బండిపొరకు దక్షిణ కశ్మీర్‌కు వెళ్లాలన్నది వారి ఆలోచన’ అని హోం శాఖ వర్గాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment