కిళ్లీ తిన్నారో.. 500 జరిమానా..! | Pan Masala And Plastic ban in Odisha Sri Manthiram | Sakshi
Sakshi News home page

శ్రీ మందిరంలో.. కిళ్లీ తిన్నారో..!

Published Thu, Mar 5 2020 1:04 PM | Last Updated on Thu, Mar 5 2020 1:04 PM

Pan Masala And Plastic ban in Odisha Sri Manthiram - Sakshi

ఒడిశా, భువనేశ్వర్‌/పూరీ: జగన్నాథుడు కొలువు దీరిన శ్రీ మందిరం లోనికి కిళ్లీ తింటూ ప్రవేశిస్తే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఆ విధంగా ప్రవేశించిన వారికి రూ.500 జరిమానా విధిస్తామని పాలక మండలి హెచ్చరించింది. జగన్నాథుని దేవస్థానం ప్రాంగణంలో కిళ్లీ వినియోగాన్ని   పూర్తిగా నిషేధించేందుకు పాలక మండలి ఈ నిర్ణయం తీసుకుంది. జిల్లా కలెక్టరేట్‌ సమన్వయంతో దేవస్థానం ప్రాంగణంలో కిళ్లీ నిషేధం పట్ల కార్యాచరణ ఖరారు చేస్తారు. దేవస్థానం ప్రాంగణంలో కిళ్లీ ఉమ్మడం నివారించాలని లోగడ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల కార్యాచరణ మరుగున పడేయడంతో ఈసారి పాలక మండలి ఘాటుగా స్పందించింది. పూర్తి స్థాయి నిషేధానికి నడుం బిగించింది. భారీగా జరిమానా విధిస్తేనే ఈ తప్పిదాన్ని నివారించడం సాధ్యమవుతుందని పలు వర్గాలు అభిప్రాయపడ్డాయి. 

సీఏఓ అధ్యక్షతన జరుగుతున్న పాలక మండలి సమావేశం
ప్లాస్టిక్‌ నిషేధం
శ్రీ మందిరం ప్రాంగణం, పరిసరాల్లో ప్లాస్టిక్‌ వినియోగం పూర్తిగా నిషేధించాలని పాలక మండలి ప్రకటించింది. ఈ కార్యాచరణ ఏప్రిల్‌ నెల ఒకటోతేదీ నుంచి అమలు జరుగుతుందని జగన్నాథ ఆలయం ప్రముఖ పాలన అధికారి (సీఏఓ) కిషన్‌ కుమార్‌ తెలిపారు. స్వామి అన్న ప్రసాదాలు నిత్యం ఆనంద బజార్‌లో విక్రయిస్తారు. ఈ ప్రసాదాల్ని సకాలంలో నివేదించి నిర్ధారిత సమయం కంటే ముందుగా భోగ మండపం నుంచి బయటకు తరలించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. అన్న ప్రసాదాల్ని తాటి ఆకు బుట్టల్లో పంపిణీ చేస్తారు. ఈ మేరకు 20 రోజులు ముందస్తుగా చైతన్య కార్యక్రమం చేపడతారు. సీఏఓ అధ్యక్షతన జరిగిన పాలక మండలి సమావేశంలో డోలో పూర్ణిమ ఉత్సవ వేళల్ని ఖరారు చేశారు. ఈ నెల 9వ తేదీన డోలోత్సవం నిర్వహిస్తారు. ఈ సమావేశానికి 36 నియోగుల సంఘం ప్రముఖులు, కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్‌ హాజరయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement