జస్టిస్ బిశ్వనాథ్ రథ్ ప్యానెల్
జూలై 14 ప్రతిపాదిత తేదీగా ప్రకటన
భువనేశ్వర్: ప్రభుత్వం ఆమోదం తెలిపిన తర్వాత శ్రీ జగన్నాథుని రత్న భాండాగారం తెలుస్తామని జస్టిస్ బిశ్వనాథ్ రథ్ అన్నారు. పూరీ శ్రీజగన్నాథ దేవాలయంలోని రత్న భాండాగారం జూలై 14న తెరవాలని ఆయన ఆధ్వర్యంలోని 16 మంది సభ్యుల తనిఖీ పర్యవేక్షక కమిటీ మంగళవారం ప్రతిపాదించింది. అయితే ఈ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంది. 46 ఏళ్ల తర్వాత భాండాగారంలో భద్రపరిచిన ఆభరణాలతో సహా విలువైన వస్తువుల వివరాలతో జాబితా రూపకల్పన కోసం పర్యవేక్షించేందుకు ఒడిశా హైకోర్టు విరామ న్యాయమూర్తి జస్టిస్ బిశ్వనాథ్ రథ్ అధ్యక్షతన అత్యున్నత స్థాయి కమిటీ రెండో సమావేశంలో రత్న భండార్‌ను తెరవడంపై నిర్ణయం తీసుకున్నారు. శ్రీ మందిరం పాలక మండలి సమావేశాన్ని ఏర్పాటు చేసి తనిఖీ పర్యవేక్షక కమిటీ ప్రతిపాదనపై చర్చించి రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తుంది.
ఏకగ్రీవ తీర్మానం
జులై 14న రత్న భాండాగారం లోపలి గది తాళం తెరవాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించినందుకు విస్తృ్తతంగా చర్చించి ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు పేర్కొన్నారు. దీని ప్రకారం మరమ్మతు పనులు, అమూల్య రత్న సంపద మరియు విలువైన వస్తువుల లెక్కింపు రెండింటికీ ఎస్‌వోపీ(స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) ప్రతిపాదించినట్లు తెలిపారు. ఉన్న తాళం చెవితో రత్న భాండాగారం తాళం తెరవలేకపోతే పగులగొట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు.
ముఖ్యంగా పూరీ జిల్లా ఖజానాలో అందుబాటులో ఉన్న రత్న భాండాగారం తాళం చెవిని ఉన్నత స్థాయి కమిటీ సమావేశానికి ముందు సమర్పించాల్సిందిగా శ్రీ జగన్నాథ ఆలయ ప్రధాన పాలన అధికారి (సీఏవో)ని అభ్యర్థించారు. రత్న భాండాగారం తెరిచే సమయంలో తోబుట్టువులతో శ్రీజగన్నాథుని రత్న వేదికపై దర్శించుకోవడంలో భక్తులకు ఎటువంటి అంతరాయం లేకుండా చర్యలు చేపడుతున్నారు. అలాగే తమ వంతు చర్యలు చేపట్టేందుకు భక్తుల సహకారం కోరినట్లు జస్టిస్ బిశ్వనాథ్ రథ్ తెలిపారు.
మరమ్మతులు పూర్తి చేస్తాం: మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్
రథయాత్ర తర్వాత దేవతలు రత్న సింహాసనంకు తిరిగి వచ్చేలోపు ఖచ్చితంగా మరమ్మతు పనులను పూర్తి చేస్తామని రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ అన్నారు. కమిటీ నిర్ణయించిన రోజునే రత్న భాండాగారం తెరిచి విలువైన వస్తువుల లెక్కింపు, తూకం మొదలవుతుందని తెలిపారు. కమిటీ ఎస్‌ఓపీని ప్రభుత్వం పరిశీలించి తదనుగుణంగా తగిన చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.
రత్న భాండాగారం తెరిచే సమయంలో దేవస్థానంలో దేవుళ్ల దైనందిన కార్యకలాపాలకు ఏమాత్రం అంతరాయం లేకుండా చూడాల్సి ఉందన్నారు. రత్న భాండాగారం సమగ్ర వివరాలు డిజిటల్ డాక్యుమెంట్ చేయబడుతుందన్నారు. అందుబాటులో ఉన్న తాళం చెవితో తాళం తెరవకుంటే, మేజి్రస్టేట్ సమక్షంలో పగలగొడతామని స్పష్టం చేశారు. ఇకపై రథయాత్రలో ప్రతి సంవత్సరం గర్భ గృహ, రత్న భాండాగారం మరమ్మతులు చేయనున్నట్లు వెల్లడించారు.
రంగంలోకి ఏఎస్‌ఐ బృందం
మరోవైపు శ్రీ మందిరం వార్షిక నిర్వహణ కార్యకలాపాలు పురస్కరించుకుని భారత పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ) సాంకేతిక కమిటీ పరిశీలన నిమిత్తం ఆలయానికి చేరుకుంది. నిర్వహణ కార్యకలాపాల విధివిధానాలను అనుబంధ కమిటీ ఖరారు చేయడంతో ప్రత్యక్షంగా రంగంలోకి దిగేందుకు సన్నద్ధత ప్రకటించింది. గర్భగుడి, నాట్య మండపం, జగ్‌మోహన్, రత్న సింహాసనం మరమ్మతుల పనులను ఏఎస్‌ఐ సాంకేతిక నిపుణుల కమిటీ పర్యవేక్షిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment